రైలు ప్రయాణంలో వ్యక్తి పోగొట్టుకున్న డబ్బుతో రైల్వేకు ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో బాధిత ప్రయాణికుడికి పరిహారం చెల్లించాలన్న కన్స్యూమర్ కోర్టు ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పక్కనబెట్టింది. ఈ మేరకు 18 ఏళ్ల నాటి కేసులో కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. 2005లో సురేంద్ర భోళా అనే వస్త్రాల వ్యాపారి రైల్లో వెళ్తుండగా ఆయన వద్ద ఉన్న రూ.లక్ష నగదు చోరీకి గురైంది. కన్ఫామ్డ్ టికెట్‌తో కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో సురేంద్ర ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ చోరీకి రైల్వే పరిహారం చెల్లించాలంటూ కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో విచారణ జరిపిన వినియోగదారుల ఫోరమ్, బాధిత ప్రయాణికుడికి లక్ష రూపాయలు పరిహారం చెల్లించాల్సిందేనని రైల్వేను ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ రైల్వే శాఖ 2015లో జిల్లా, జాతీయ కన్స్యూమర్ కమిషన్‌లో అప్పీల్ చేసింది. ప్రయాణికుల వ్యక్తిగత వస్తువులకు తాము బాధ్యత వహించబోమని తెలిపింది. అయితే అక్కడ ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అసనుద్దీన్ అమనుల్లాతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా రైల్వే తరఫున న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ.. సదరు ప్రయాణికుడు తన డబ్బును బెల్టులో దాచి నడుముకు కట్టుకున్నాడని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వాదోపవాదాలు విన్న ధర్మాసనం.. ఈ కేసులో కన్స్యూమర్ కమిషన్ ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. ఇది రైల్వే లోపం కాదని తెలిపింది. ''ప్రయాణికుడు తన సొంత వస్తువులను కాపాడుకోలేకపోతే.. దానికి రైల్వే బాధ్యత వహించదు'' అని తేల్చిచెప్పింది.
పోగొట్టుకున్న డబ్బుతో రైల్వేకు ఎలాంటి సంబంధం లేదు !
June 16, 2023
0
Tags