డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలు ఘనంగా కొనసాగాయి. తొలుత ప్రగతి భవన్‌లో ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి నేరుగా గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అక్కడ నుండి సెక్రటేరియట్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సాదర స్వాగతం పలికారు. కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేదిక మీదకు చేరుకున్న అనంతరం తెలంగాణ అవతరణ దినోత్సవ సందేశాన్నిచ్చారు. తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగుపెడుతున్న స్వయం పాలన, సాధించిన అభివృద్ధిని సీఎం కేసీఆర్ విశ్లేషణాత్మకంగా వివరించారు. తొమ్మిదేండ్ల క్రితం 2014 జూన్ 2 నాడు భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ, అనేక అడ్డంకులు దాటుకుంటూ ప్రగతి ప్రస్థానంలో సాగుతూ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం అన్నారు. తెలంగాణ మోడల్‌గా కీర్తి ప్రతిష్టలందుకుంటున్న జన పాలన గురించి సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో కూలంకషంగా వివరించారు. గంటన్నరపాటు సాగిన ప్రసంగంలో ఒక్కో రంగంలో సాధించిన అభివృద్ధిని మానవీయ కోణంలో సాగించిన పాలనాదార్శనికతను విశ్లేషించారు. వ్యవసాయం నుంచి మొదలుకొని ఆర్థిక రంగం వరకు అన్ని రంగాల్లోగుణాత్మక అభివృద్ధి సాధించడం వెనక జరిగిన ప్రభుత్వ కృషిని ప్రజల భాగస్వామ్యం గురించి సీఎం వివరించారు. తెలంగాణ సాధిస్తున్న ప్రగతి స్పూర్తిని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. సర్వజన హితాన్ని కాంక్షిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ సహా పేద వర్గాలకు సర్వజన సుఖం కోసం తమ పాలన కొనసాగుతూనే వుంటుందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.
ఘనంగా రాష్ట్ర అవతరణ శతాబ్ది వేడుకలు
June 02, 2023
0
Tags