మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు !

Telugu Lo Computer
0


వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు రాజకీయ నేతలు రెజ్లర్లపై తప్పుడు విషయాలు ప్రచారం చేస్తున్నారని కామన్‌వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ విజేత, ప్రముఖ రెజ్లర్ వినేష్ పొఘట్ ఆరోపించారు. ఒలిపింక్ మెడలిస్ట్స్ సాక్షి మాలిక్‌, భజరంగ్ పునియా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ అంశాలపై తాము ప్రజల ముందుకు వస్తామని వారు వెల్లడించారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని కోరుతూ సాక్షి మాలిక్‌, వినేష్ పొఘట్‌, భజరంగ్ పూనియా సహా పలువురు రెజ్లర్లు ఈ ఏడాది ఆరంభం నుంచి ఢిల్లీలో నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. మహిళా రెజ్లర్ల పర్యవేక్షక కమిటీలో సభ్యుడిగా బీజేపీ నేత యోగేశ్వర్ దత్ నియామకాన్ని వినేష్ పొఘట్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మహిళా రెజ్లర్లకు వ్యతిరేకంగా ఆయన బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని ఆక్షేపించారు. అయినా ఆయనను కమిటీల్లో ఎందుకు కొనసాగిస్తున్నారని వినేష్ పొఘట్ నిలదీశారు. మహిళా రెజ్లర్ల ఆందోళనలో పాల్గొనకుండా రెజ్లర్లు, కోచ్‌లను ఆయన అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బ్రిజ్ భూషణ్‌కు సహకరించే వ్యక్తిగా యోగేశ్వర్‌పై ముద్ర పడిందని చెప్పారు. కమిటీ ఎదుట మహిళా రెజ్లర్లు తాము ఎదుర్కొన్న వేధింపులను వివరిస్తుండగా ఆయన నవ్వుతూ చెత్త హావభావాలు కనబరిచేవారని అన్నారు. బ్రిజ్ భూషణ్‌కు ఏమీ జరగదని మీరు వెళ్లి ప్రాక్టీస్ చేసుకోండని మహిళా రెజ్లర్లకు చెప్పేవాడని ట్వీట్‌లో ఆమె పేర్కొన్నారు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి..ఇలాంటి వాటిని పెద్ద విషయం చేయకండని మరో మహిళా రెజ్లర్‌తో అన్నారని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)