ఏ తప్పు చేయకుండా 301 రోజులు జైలు జీవితం !

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ కు చెందిన పలాష్, శుక్ల అధికారి అనే దంపతులు పొట్ట కూటి కోసం బెంగళూరుకు కూలీలుగా వచ్చారు. వీరికి రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. అయితే అక్రమ బంగ్లాదేశీ వలసదారులన్న అనుమానంతో 2022 జూలై నెలలో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. విదేశీయుల చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అయితే తాము పశ్చిమ బెంగాల్ లోని తూర్పు బుర్ద్వాన్ లోని జమాల్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జౌగ్రామ్ కి చెందిన వారమని శుక్ల అధికారి, అతని భార్య పలాష్ బెంగళూరు పోలీసులకు ఎంత చెప్పినా వినలేదు. బెంగళూరు నగర శివారులో ఉన్న సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ తర్వాత పోలీసులు తూర్పు బుర్ద్వాన్ లో ఉన్న పలాష్ ఇంటిని చెక్ చేశారు. స్థానిక జమాల్ పూర్ బీడీఓను సంప్రదించి పత్రాలను సరిచూసుకున్నారు. పలాష్ బంధువులు బెంగళూరుకు చేరుకొని బెయిల్ పిటిషన్ వేశారు. ఎట్టకేలకు దంపతులకు ఏప్రిల్ 28న బెయిల్ మంజూరైంది. అయితే దంపతులకు చెందిన భూమి పత్రాలను ఆలస్యంగా సమర్పించడంతో మే 24న జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో దంపతులు తమ సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. వీరు బయటకు రావడం కోసం శుక్ల అధికారి సోదరి సతీ అధికారి ఎంతగానో సహాయం చేశారు. బ్యూటీ పార్లర్ నడుపుతున్న సతీ అధికారి తన సంపాదనను కేసు పోరాటం కోసం ఖర్చు పెడుతున్నారు. మే 24న ఉదయం 9.30 గంటలకు అన్న, వదినలు విడుదలవుతున్నారని తెలిసి వీడియో కాల్ ద్వారా మాట్లాడానని, ఆ సమయంలో తన తల్లికి కన్నీళ్లు ఆగలేదని సతీ అధికారి వెల్లడించారు. వాళ్ళు చాలా నీరసంగా ఉన్నారని.. తన మేనల్లుడుతో మాట్లాడానని అన్నారు. ప్రస్తుతం దంపతులిద్దరూ తమ సొంత గ్రామంలోనే ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)