బెంగాల్‌లో ఏదైనా జరిగినప్పుడు తమ పరువు తీసేందుకు వందలాది కేంద్ర బృందాలను ఇక్కడికి పంపుతారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. మణిపూర్ బీజేపీ పాలిత రాష్ట్రం కావడంతో అక్కడ ఎలాంటి హడావుడి చేయడం లేదని ఎద్దేవా చేశారు. మణిపూర్ హింసలో ఎంత మంది మరణించారన్నది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని మమతా బెనర్జీ ప్రశ్నించారు. హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కనిపిస్తే కాల్చివేయాలన్న ఆదేశాలు జారీ చేయడాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ కాల్పులతోపాటు సాధారణ హింసలో ఎంత మంది చనిపోయారు అన్నది చెప్పాలన్నారు. ఈ సంఖ్య 60-70 మధ్య ఉండవచ్చని తెలుస్తున్నదని, అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సరైన సంఖ్య వెల్లడించడం లేదని ఆరోపించారు. అలాగే మణిపూర్‌లో గత వారం రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసిన పరిస్థితులపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌కు చెందిన 185 మంది మణిపూర్‌లో చిక్కుకున్నారని మమతా బెనర్జీ తెలిపారు. వారి తరలింపు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. హింస నేపథ్యంలో మణిపూర్‌లో చిక్కుకున్న బెంగాల్ ప్రజల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే ఇంఫాల్ నుంచి 18 మంది బెంగాల్ విద్యార్థులను ప్రభుత్వం ఖర్చుతో ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు తరలించినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
బెంగాల్‌లో ఏదైనా జరిగితే కేంద్రం హడావుడి చేస్తుంది !
May 08, 2023
0
Tags