జమ్మూకాశ్మీర్ లోని కథువా జిల్లాకు చెందిన స్కూల్ విద్యార్థిని సీరత్ నాజ్ వీడియో ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమ స్కూల్ దుస్థితిని వివరిస్తూ ప్రధాని మోడీకి ఈ వీడియో సందేశం పంపింది. ''మోదీజీ మాకో చక్కటి పాఠశాల నిర్మించి ఇవ్వరూ..'' అంటూ ఆ చిన్నారి ప్రధానిని రిక్వెస్ట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడా వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ చిన్నారి వీడియోలో మాట్లాడుతూ.. ''మోడీ గారు దేశం మొత్తం చేస్తున్న విన్నపాలు మీరు వింటున్నారు. మా అభ్యర్థనను కూడా విని ఓ చక్కటి పాఠశాల భవనాన్ని నిర్మించి ఇవ్వండి'' అంటూ రిక్వెస్ట్ చేసింది. మేం నేలపై కూర్చుంటే మా యూనిఫాం మురికిగా అవుతుందని మా అమ్మ తిట్టకుండా చూడండి అంటూ ముగించింది. అయితే తన పాఠశాల పునరుద్దరించాలనే సీరత్ నాజ్ సంకల్పానికి నెటిజన్లు ప్రశంసించారు. ''నీవు ధైర్యంగల బిడ్డవు.. నీ ధైర్యానికి మేం గర్విస్తున్నాం'' అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మరో నెటిజన్ స్పందిస్తూ నీవు భావితరాల గొంతుకవు.. మీ స్థానిక ఎమ్మెల్యే స్పందించి నీ కోరిక మేరకు మీ స్కూల్‌ను పునరుద్ధరించాలని అభ్యర్థిస్తున్నాని పోస్ట్ రాశాడు. ఆ చిన్నారిపై ప్రజలు ఆశీస్సుల వర్షం కురిపించారు. ''నీవు నిజంగా తెలివైనదానివి. మోదీ జీ నీ కోరికను ఖచ్చితంగా నెరవేర్చుతారు. దేవుడు, ప్రధాని నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు'' అంటూ పోస్ట్ చేశారు. అంతేకాదు చాలామంది సీరత్ నాజ్ స్కూల్ త్వరలో పునరుద్దరించబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీరత్ నాజ్ అభ్యర్థనను పరిశీలించాలని నెటిజన్లు కూడా ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించారు. "ప్రతి బిడ్డకు విద్య అవసరం... ప్రధాని మోడీజీ దయచేసి సీరత్ నాజ్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోండి. ఈ పిల్లలే భారతదేశ భవిష్యత్తు" అని పేర్కొన్నారు.
''మోడీ జీ మాకో చక్కటి పాఠశాల నిర్మించి ఇవ్వరూ''
April 14, 2023
0
Tags