రష్యా రాజధాని మాస్కో నగరానికి చెందిన ఒక మహిళ తన 14 ఏళ్ల కుమార్తెతో ఒంటరిగా ఉంటోంది. ఆ బాలిక తన స్నేహితుడితో సన్నిహితంగా ఉండేది. వారిద్దరూ చనువుగా ఉండటం గమనించిన తల్లి తన కుమార్తెకు దూరంగా ఉండాలని బాలుడిని హెచ్చరించింది. అతడిని మరోసారి కలవకూడదని తన కూతురిని గట్టిగా మందలించింది. ఇదంతా నచ్చని బాలిక తన తల్లిపై ద్వేషాన్ని పెంచుకుంది. ఆమెను హత్య చేయించడానికి కుట్రపన్నింది. స్నేహితుడితో కలిసి ఇద్దరు కిరాయి హంతకులకు డబ్బులు ఇచ్చింది. వారు అత్యంత కిరాతకంగా ఆమెను కొట్టి, గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి బెడ్ లోపల పెట్టి చెత్తకుప్పలో పడేశారు. ఓ వ్యక్తి చెత్తకుప్ప వద్ద మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విచారణ జరిపిన పోలీసులు బాలికను అరెస్టు చేశారు. హత్య జరిగిన సమయంలో బాలిక, ఆమె స్నేహితుడు ఇంట్లోనే ఉన్నారని వారే నిందితులను లోపలికి రప్పించారని పోలీసులు తెలిపారు. బాధితురాలి హత్యకు కుట్ర పన్నిన, హత్య చేసిన నిందితులందరూ 14 నుంచి 17 ఏళ్ల వయసులోపు వారేనని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలిని కొట్టి, గొంతు నులిమి చంపారని అటాప్సీలో తేలింది. '' నా స్నేహితురాలి తల్లి ఎంతో మంచివారు. తనను ఎంతో ప్రేమించేది. అయినప్పటికీ తను వాళ్ల అమ్మను ద్వేషిస్తూనే ఉండేది'' అని బాలిక స్నేహితురాలు తెలిపింది.
స్నేహితుడితో సన్నిహితంగా ఉండొద్దన్నందుకు తల్లిని చంపిన కూతురు !
April 05, 2023
0
Tags