రష్యాకు నూతనంగా 17 దేశాల రాయబారులు నియమితులవ్వగా పుతిన్ వారిని అధికారికంగా కలిశారు. అనంతరం విదేశీ రాయబారులనుద్దేశించి కొద్దిసేపు ప్రసంగించిన పుతిన్, అమెరికా, ఐరోపా దేశాల నూతన రాయబారులపై విమర్శలు గుప్పించారు. 2014లోని ఉక్రెయిన్ తీర్మానానికి అమెరికా మద్దతు ఇవ్వడం వల్లే ప్రస్తుత సంక్షోభానికి దారితీసిందని, రష్యాతో పశ్చిమ దేశాల సంబంధాలు దెబ్బతినడానికి ఆ దేశాల రాయబారులే కారణమని ఆరోపించారు. బహుశా ఆయన చేసిన ఈ విమర్శల పట్ల నొచ్చుకున్నారో, లేక మరే ఇతర కారణాలున్నాయో తెలీదు కానీ.. పుతిన్ తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత ఆ కార్యక్రమంలో ఉన్నవారెవరూ చప్పట్లు కొట్టలేదు. పుతిన్ కాసేపు నవ్వుతూ ఎదురుచూసినా.. రాయబారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దొరికిందే అవకాశంగా భావించి.. ఈ వీడియోని ఉక్రెయిన్ హోం మంత్రిత్వ శాఖ సలహాదారు ఆంటన్ గెరాషెంకో తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసి, పుతిన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ''పుతిన్ తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత, ఎవ్వరూ చప్పట్లు కొట్టలేదు. చప్పట్ల కోసం ఆయన ఎదురుచూసినా, ఎవ్వరూ స్పందించలేదు'' అంటూ పోస్ట్ పెట్టాడు. మెడెజా ఎండీ కూడా దీనిపై స్పందిస్తూ.. గతేడాది జరిగిన విదేశీ రాయబారుల కార్యక్రమంలోనూ పుతిన్ ప్రసంగానికి ఎవరూ చప్పట్లు కొట్టలేదని, అప్పుడు కూడా క్రెమ్లిన్ ఆ వీడియోను కట్ చేసి బయటకు విడుదల చేసిందని తెలిపారు.
పుతిన్ ప్రసంగానికి స్పందన కరవు !
April 08, 2023
0
Tags