దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన బలగం మూవీ మార్చి 3న విడుదలై విమర్శల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఓటీటీలోనూ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాకు వచ్చిన మౌత్ టాక్ తో పలు గ్రామాల్లో ఫ్రీ షోలు ఏర్పాటు చేశారు. తాజాగా బలగం ఫ్రీ షోలపై నిర్మాత దిల్ రాజు పోలీసు కంప్లయింట్ చేశారు. ఫ్రీ షోల వల్ల థియేటర్ రెవెన్యూకు గండి పడుతోందని గుర్తించిన దిల్ రాజు తన నిర్మాణ సంస్థ తరఫున నిజామాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అందులో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు అమెజాన్ ప్రైమ్ నుంచి చట్టవ్యతిరేకంగా డౌన్లోడ్ చేసుకుని ఉచితంగా ప్రజలకు పంచి పెడుతున్నాయని, వాళ్ల మీద చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే నిజానికి ఎగ్జిబిషన్ యాక్ట్ ప్రకారం నిర్మాత అనుమతి లేకుండా వందల జనంలో సినిమా వేయడం ఇల్లీగలే అని సెక్షన్లు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే దిల్ రాజు ఫిర్యాదుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బలగం మూవీ సక్సెస్ మీట్ లో ఈ చిత్రాన్ని డబ్బు కోసం తీయలేదు. మానవ సంబంధాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీశాను అని దిల్ రాజు చెప్పడాన్ని దెప్పు పొడుస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
బలగం ఫ్రీ షోలపై దిల్ రాజు పోలీసులకు ఫిర్యాదు !
April 04, 2023
0
Tags