కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డిఎ పెంచాలని కోరుతూ పశ్చిమ బెంగాల్‌లోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు శుక్రవారం నిర్వహించిన ఒక రోజు సమ్మె విజయవంతమయింది. వివిద ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన ఈ సమ్మెలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, భోదనేతర సిబ్బంది, స్థానిక సంస్థల ఉద్యోగులు పాల్గొన్నారు. శుక్రవారం విధులకు హాజరు కాకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని మమతా బెనర్జీ ప్రభుత్వం బెదిరించినా ఉద్యోగులు ఏ మాత్రం బెదరకుండా ఈ సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె సందర్భంగా రాష్ట్ర రాజధాని రైటర్స్ బిల్డింగ్, బికాశ్ భవన్, ఖద్యా భవన్, స్వస్త భవన్, కొల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ భవనాల ముందు ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. జిల్లా కేంద్ర పట్టణాలు, బ్లాక్ డెవలప్‌మెంట్ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, పంచాయితీ కార్యాలయాల వద్ద కూడా ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. మేదనీపూర్ కళాశాల, పశ్చిమ్ మేదీనీపూర్, ఉత్తర బెంగాల్ విశ్వ విద్యాలయం, సిలిగురి శిక్షా భవన్ వద్ద ప్రధాన ద్వారాల ఉద్యోగులు ఆందోళన నిర్వహించి టిఎంసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మె విజయవంతమైన సందర్భంగా ఉద్యోగులకు సిఐటియు అభినందనలు తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లోని టిఎంసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తన స్వంత ఉద్యోగులకు శత్రువుగా మారిందని సిఐటియు విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వ అణచివేత, నిషేధాజ్ఞలు, శిక్షార్హత చర్యలన్నింటీని ధిక్కంచి ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అలాగే పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యను సిఐటియు ఖండించింది.
విజయవంతమైన బెంగాల్‌లో ఉద్యోగుల సమ్మె
March 11, 2023
0
Tags