అదానీ వ్యవహారంపై 'బ్లూమ్‌బర్గ్‌' తాజా కథనం !

Telugu Lo Computer
0


అదానీ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంతో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ మదుపరులు పునరాలోచిస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్‌ ఉదంతంపై ప్రఖ్యాత 'బ్లూమ్‌బర్గ్‌' బిజినెస్‌వీక్‌ మ్యాగజైన్‌లో తాజాగా ఓ కథనాన్ని కవర్‌స్టోరీగా ప్రచురించింది. 'హిండెన్‌బర్గ్‌' ఆరోపణలు, దానిపై అదానీ గ్రూప్‌ స్పందన, అదానీ గ్రూప్‌ షేర్ల పతనం తదితర ఆంశాలను ఈ కథనంలో విశ్లేషించింది. దీంతోపాటు వ్యాపారిగా మారకముందు గౌతమ్‌ అదానీ పరిస్థితి, ప్రధాని మోదీతో ఆయన సాన్నిహిత్యం వంటి కీలక అంశాలను ప్రత్యేకంగా చర్చించడం గమనార్హం. భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాల్లో అదానీ గ్రూప్‌ పాతుకుపోయిన విధానం, సామాన్యుల దైనందిన జీవితాన్ని అదానీ గ్రూప్‌ ఎంతలా ప్రభావితం చేస్తున్నదన్న అంశాన్ని ఉదాహరణలతో ప్రచురించింది. 'బ్లూమ్‌బర్గ్‌' ప్రచురించిన కవర్‌స్టోరీపై ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కళాశాల చదువును మధ్యలోనే ఆపేసిన గౌతమ్‌ అదానీ, అపర కుబేరుడిగా ఎలా మారారన్న విషయాన్ని బ్లూమ్‌బర్గ్‌ తన కథనంలో చర్చించింది. అహ్మదాబాద్‌లో జన్మించిన అదానీ, ఎనిమిది మంది సంతానంలో ఆయన ఏడోవాడు. తండ్రి బట్టల వ్యాపారి. తల్లి గృహిణి. కళాశాల విద్య కోసం ముంబైలోని ఓ కాలేజీలో అడ్మిషన్‌ తీసుకొన్న అదానీ, ఆరు నెలలు తిరగకుండానే కాలేజీ మానేశారు. తర్వాత వజ్రాల ట్రేడింగ్‌లోకి దిగారు. అనంతరం తన సోదరుడి ప్లాస్టిక్‌ కర్మాగారంలో పనిచేశారు. 1988లో వస్తువుల విక్రయ కంపెనీని ఏర్పాటు చేశారు. గుజరాత్‌లోని పోర్టు కాంట్రాక్టు దక్కడంతో ఆయన దశ తిరిగింది. బొగ్గు గనులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, డాటా కేంద్రాలు, విద్యుదుత్పత్తి, గ్యాస్‌ పంపిణీ, సిమెంట్‌ తయారీ, వంటనూనెలు, మీడియా తదితర రంగాలకు అదానీ వ్యాపారాన్ని విస్తరించారు. నరేంద్రమోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే రాష్ట్రానికి చెందిన అదానీ ఆస్తులు ఎంత ఉన్నాయి? మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనతికాలంలోనే ఎలా పెరిగాయి అన్నదానిని కూడా 'బ్లూమ్‌బర్గ్‌' విశ్లేషించింది. దేశంలో తయారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమంటూ ప్రధాని మోదీ తీసుకొచ్చిన 'మేకిన్‌ ఇండియా' పథకానికి అదానీ పిల్లర్‌గా మారారని కథనంలో వెల్లడించింది. 2000 సంవత్సరం నుంచే వీళ్లిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటున్నారని, మోదీ దేనిపై ఆసక్తి కనబరుస్తారో.. ఆ రంగంలోకి అదానీ ప్రవేశిస్తారని పేర్కొన్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)