ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ అపాయింట్ మెంట్ కోసం అధికార వైసీపీలో పోటీ నెలకొంది. నజీర్ ఇంకా గవర్నర్ గా బాధ్యతలు తీసుకోలేదు. అయినా ఆయన్ను కలిసేందుకు వైసీపీ నేతలు ఢిల్లీలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ముందుగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆయన అపాయింట్ మెంట్ సాధించారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ ఢిల్లీలో కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయ్యారు. గవర్నర్ గా నియమితులైన ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన రఘురామకృష్ణంరాజు.. రాష్ట్రంలో పరిణామాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ సర్కార్ తో విభేదిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు అబ్దుల్ నజీర్ ముందుగా అపాయింట్ మెంట్ ఇవ్వడంతో వీరిద్దరి మధ్య జరిగిన చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏపీకి తొలిసారి గవర్నర్ గా వస్తున్న అబ్దుల్ నజీర్ కు రాష్ట్రంలో పరిణామాలు, పరిస్దితులు వివరించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ముందుగా గవర్నర్ ను కలిస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్న కొందరు నేతలు కూడా అపాయింట్ మెంట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ఐఏఎస్ అధికారి సౌరభ్ గౌర్ కు జస్టిస్ నజీర్ తొలి అపాయింట్ మెంట్ ఇచ్చారు. రాజకీయ నేతల్లో అయితే రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలు గవర్నర్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్న వేళ రఘురామకు ముందుగా దొరకడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గవర్నర్ అబ్దుల్ నజీర్ తో రఘురామ భేటీ
February 14, 2023
0
Tags