గవర్నర్ల నియామక విధానంపై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. కేంద్ర ప్రభుత్వం నేడు కొత్తగా ఆరుగురిని గవర్నర్లుగా నియమిస్తూ, ఏడుగురు గవర్నర్లను బదిలీ చేయడంతో కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోసం పని చేసేవారికి గవర్నర్ పదవిని ఇస్తున్నారని దుయ్యబట్టింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా నియమించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, మోదీ కోసం పని చేసినవారు ఇప్పుడు గవర్నర్లు అయ్యారని వ్యాఖ్యానించారు. అదానీ కోసం మోదీ పని చేస్తారని, మోదీ కోసం పని చేసేవారు గవర్నర్లు అవుతారని అన్నారు. ఇక ప్రజల కోసం ఎవరు పని చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఇచ్చిన ట్వీట్‌లో గతంలో బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. 'రిటైర్‌మెంట్ తర్వాత వచ్చే పదవుల ద్వారా రిటైర్‌మెంట్‌కు ముందు ఇచ్చే తీర్పులు ప్రభావితమవుతాయి' అని జైట్లీ 2012లో ఇచ్చిన ఆ ట్వీట్‌లోని వీడియోలో పేర్కొన్నారు. ''గడచిన మూడు నాలుగేళ్ళలో దీనికి కచ్చితమైన రుజువు ఉంది'' అని జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ 2023 జనవరి 4న సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి రిటైర్ అయ్యారు. అయోధ్య రామజన్మభూమి కేసులో తీర్పు చెప్పిన ధర్మాసనంలో ఆయన కూడా ఉన్నారు. ఈ ధర్మాసనంలో ఉన్న ఏకైక ముస్లిం జడ్జి ఆయన. 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనంలో కూడా ఆయన ఉన్నారు. ఈ ప్రక్రియ సరైనదేనని ఈ ధర్మాసనం తీర్పు చెప్పింది.
మోదీ కోసం పని చేసేవారికి గవర్నర్ పదవి !
February 12, 2023
0
Tags