35 ఏళ్ల తర్వాత తెరచుకున్న సరిహద్దు కేంద్రం

Telugu Lo Computer
0


35 ఏళ్ల తర్వాత  తుర్కియే, అర్మేనియా దేశాల మధ్య మొదటిసారి సరిహద్దు పాయింట్‌ నుంచి రాకపోకలు మొదలయ్యాయి.  భూకంప ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, నీళ్లు, ఔషధాలు, ఇతర సామగ్రి చేరవేసేందుకు అర్మేనియాకు చెందిన ఐదు ట్రక్కులు ఇక్కడి అలికాన్ సరిహద్దు ప్రాంతంనుంచి తుర్కియేలోకి ప్రవేశించాయి. అర్మేనియాకు తుర్కియే ప్రత్యేక ప్రతినిధి సెర్దార్ కిలిక్ శనివారం ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. సాయానికి ధన్యవాదాలు తెలిపారు. 1988లో అర్మేనియాలో భారీ భూకంపం సంభవించి దాదాపు 25 వేల నుంచి 30 వేల మంది మృతి చెందారు. ఆ విపత్కర సమయంలో బాధిత దేశానికి తుర్కియే సాయం అందించింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య సరిహద్దు పాయింట్‌ను తెరవడం ఇదే మొదటిసారని స్థానిక వార్తా సంస్థ తెలిపింది. తుర్కియే, అర్మేనియాలు ఎప్పుడూ అధికారిక దౌత్య సంబంధాలను ఏర్పరచుకోలేదు. 1990ల నాటినుంచి వారి ఉమ్మడి సరిహద్దు మూసి ఉంది. ఒట్టోమన్ సామ్రాజ్యంలో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అర్మేనియన్ల ఊచకోతతో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, ఈ ఆరోపణలను తుర్కియే కొట్టిపారేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. ఇరుదేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు వీలుగా 2021లో రెండు దేశాలు ప్రత్యేక దూతలను నియమించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)