అప్ఘన్ భూభాగంలో నిక్షిప్తమైన ట్రిలియన్ డాలర్ల విలువైన ఖనిజాలపై చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. వాటిని వెలికి తీయడానికి తాజాగా తొలి అడుగు వేసింది. చైనాకు చెందిన షింజియాంగ్ సెంట్రల్ ఏషియా పెట్రోలియం అండ్ గ్యాస్ కంపెనీతో నిన్న150 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని చేసుకొంది. దీని ప్రకారం అము నదీ పరీవాహక ప్రాంతంలో చైనా కంపెనీ చమురును వెలికి తీయనుంది. ఈ డీల్ ద్వారా నాలుగు వేల చదరపు కిలో మీటర్ల పరిధిలో చమురు అన్వేషణ, వెలికితీత జరుగుతాయి. దాదాపు 3,000 మంది అప్ఘన్ వాసులకు ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. ఈ ఒప్పందం కింద చేపట్టే చమురు ప్రాజెక్టులో తాలిబన్లకు 20శాతం వాటా లభిస్తుంది. దీనిని 75 శాతం వరకు పెంచుకొనే అవకాశం ఉంది. ఈ ఒప్పందంపై తాలిబన్ షాబుద్దీన్ దిలావర్ మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో చైనా నుంచి 540 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడుల రూపంలో రావొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందంపై చైనా రాయబారి వాంగ్ మాట్లాడుతూ భవిష్యత్తులో అప్ఘనిస్థాన్‌తో ద్వైపాక్షిక అభివృద్ధికి ఇది శుభారంభం అని తెలిపారు. అప్ఘన్ చట్టాలను పూర్తిగా పాటించాలని ఈ సందర్భంగా చైనా కంపెనీకి ఆయన సూచించారు. కాంట్రాక్టుకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలన్నారు. గతంలో పౌర ప్రభుత్వం ఉన్న సమయంలో అము దరియా బేసిన్‌లో చమురు ఉత్పత్తిపై ఒక అప్ఘన్ కంపెనీతో చైనా ప్రభుత్వ రంగ పెట్రోలియం కార్పొరేషన్ సంతకం చేసింది. కానీ, తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ఆ ఒప్పందాన్ని రద్దు చేసినట్లు తాజాగా ప్రకటించారు. కొత్త ఒప్పందం కింద వెలికి తీసిన చమురును అప్ఘనిస్థాన్‌లోనే ప్రాసెసింగ్ చేస్తారు.
చైనాతో తాలిబన్ల 150 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం
January 06, 2023
0
Tags