షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

Telugu Lo Computer
0


వైఎస్‌ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. వరంగల్‌ జిల్లాలో షర్మిల పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు అనుమతి రద్దు చేసిన విషయం తెలిసిందే. పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ వైతెపా సభ్యుడు రవీంద్రనాథ్‌రెడ్డి, తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం షర్మిల పాదయాత్రకు ఇటీవల షరుతులతో కూడిన అనుమతిచ్చింది. అయితే, ఆ సందర్భంగా న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది. సీఎం కేసీఆర్‌పై, రాజకీయ, మతపరమైన అంశాలను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని ఆదేశించింది. పాదయాత్ర కోసం దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించిన హైకోర్టు, పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను ఆదేశించింది. అయినా పోలీసులు అప్పటి నుంచి పాదయాత్రకు అనుమతివ్వకపోవడంతో వైతెపా నేతలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ''పాదయాత్రకు కోర్టు అనుమతిచ్చాక పోలీసులెలా నిరాకరిస్తారు? రాజకీయ నేతలందరూ పాదయాత్ర కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టు ఆర్డర్‌ ఇచ్చినా తర్వాత కూడా తెరాస నేతలపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. తెలంగాణను తాలిబన్ల రాష్ట్రంగా మారుస్తున్నారని రాజ్‌భవన్‌ నుంచి బయటకు వచ్చాక షర్మిల అభ్యంతర వ్యాఖ్యలు చేశారని వివరించారు. రాజ్‌భవన్‌ దగ్గర వ్యాఖ్యలు చేస్తే పాదయాత్రకు ఎందుకు అనుమతి నిరాకరించారని ధర్మాసనం ప్రశ్నించింది. ''హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రం గురించి వ్యాఖ్యానించడం సరికాదు. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సాధారణం'' అని హైకోర్టు అభిప్రాయపడింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం షర్మిల పాదయాత్రకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన షరతులు గుర్తుంచుకోవాలని షర్మిలకు హైకోర్టు సూచించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)