ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ జిల్లాలోని ఆల్ దువా మాంసం ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో పలువురు స్పృహ తప్పి పడిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఉద్యోగుల సంఖ్య 65కుపైగానే ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. ఉద్యోగుల్లో బాలికలు, మహిళలు, పురుషులు ఉన్నారు. అస్వస్థతకు గురైన దాదాపు 50 మంది మందిని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి తరలించారు. మరికొందరు కూలీలను ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. గ్యాస్ లీకేజీ వల్ల అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌ల నుంచి కొందరు వ్యక్తులు తమ భుజాలపై మోసుకుని ఆసుపత్రి లోపలకు తీసుకెళ్లిన దృశ్యాలు టీవీ ఛానెల్స్‌లో కనిపించాయి. గ్యాస్ లీక్‌ను ఆపేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. మొదట గ్యాస్ లీక్ అయినప్పుడు మాంసం ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ విషయాన్ని దాచి పెట్టిందని, ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అధికారులకు సమాచారం అందించారని తెలిసింది. జిల్లా మేజిస్ట్రేట్ ఇందర్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. ఆల్ దువా మీట్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీకేజీ జరిగిందని, దీని కారణంగా చాలా మంది స్పృహ తప్పి పడిపోయారని చెప్పారు. అస్వస్థతకు గురైన వారందరికీ మెరుగైన వైద్యం చేయాలని వైద్యులను జిల్లా అధికారి ఆదేశించారు.
మాంసం ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్
September 29, 2022
0