తమ్ముడి మృత దేహంతో రోడ్డుపై కూర్చున్నబాలుడు !

Telugu Lo Computer
0

 


మధ్యప్రదేశ్, అంబాహ్‌లోని బద్‌ఫ్రా గ్రామంకు పూజారాం జాతవ్ కు ఇద్దరు కుమారులు. రెండేళ్ల కుమారుడు రాజా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. మొదట్లో జాతవ్ తన కొడుకుకు ఇంట్లోనే వైద్యం అందించాడు. కానీ అతనికి కడుపు నొప్పి భరించలేనంతగా రావడంతో రాజాను మొరెనా జిల్లాలోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లాడు. అతనితో పాటు అతని పెద్ద కుమారుడు గుల్షన్ కూడా ఆసుపత్రికి వెళ్లాడు. అయితే మొరెనా జిల్లా ఆసుపత్రిలో రాజా మృతి చెందాడు. నిరుపేద, నిస్సహాయుడైన పూజారాం మృతదేహాన్ని తిరిగి స్వగ్రామానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆసుపత్రి అధికారులను వేడుకున్నాడు. ఎన్నిసార్లు అభ్యర్థించిన ఆస్పత్రి సిబ్బంది అందుకు నిరాకరించారు. ఆసుపత్రి అధికారులు అంబులెన్స్‌ను నిరాకరించడంతో ఆ వ్యక్తి తన బిడ్డ మృతదేహంతో ఆసుపత్రి నుండి బయటకు వచ్చి రోడ్డుపై కూర్చున్నాడు. కొడుకు మృతదేహం ఇంటికి తీసుకెళ్లేందుకు ఏ వాహనం దొరకక పోవటంతో తీవ్ర ఆవేదనకు గురైన పూజారామ్ వేరే మార్గం లేక తన పెద్ద కొడుకు గుల్షన్‌ను మృతదేహంతో ఆసుపత్రి వెలుపల వదిలి ఇంటికి వెళ్లి వస్తానని వెళ్లిపోయాడు. ఎనిమిదేళ్ల బాలుడు గుల్షన్ రోడ్డుపై రెండేళ్ల తమ్ముడి మృతదేహంతో తన ఒడిలో తమ్ముడి తలను పెట్టుకుని తండ్రి తిరిగి వస్తాడనే ఆశతో ఎదురు చూస్తూ కూర్చుండిపోయాడు. అరగంట సేపు అక్కడే కూర్చున్నాడు. స్థానికులు బాలుడి వద్దకు వెళ్లి ఏం జరిగిందని ఆరాతీయగా అసలు విషయంలో వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటన స్థలికి చేరుకొని ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి అంబులెన్స్‌ను ఏర్పాటు చేయించారు. ఈ విషయంపై పూజారామ్ జాతవ్ మాట్లాడుతూ బిడ్డ తల్లి ఇంట్లో లేదు, నేను పేదవాడిని. నా బిడ్డ ఏమి తిన్నాడో నాకు తెలియదు. అతని పరిస్థితి మరింత దిగజారింది. నేను వైద్యుడిని సంప్రదించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మృతదేహాన్ని తరలించేందుకు నా దగ్గర అంతడబ్బు లేదు. దీంతో ఆస్పత్రి సిబ్బందిని అంబులెన్స్ ఏర్పాటు చేయాలని వేడుకున్నా వారు వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మోరీనా సివిల్ సర్జన్ వినోద్ గుప్తా మాట్లాడుతూ బాలుడు మృతదేహాన్ని తరలించేందుకు మేము అంబులెన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. వాహనం వచ్చే సమయానికి పిల్లల తండ్రి వెళ్ళిపోయాడని తెలిపాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)