కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు కెనడాలోని భారత హైకమిషనర్ అజయ్ బిసారా తెలియజేశారు. మృతుల కుటుంబీకులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ఒంటిరియో ప్రావిన్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను హర్‌ప్రీత్ సింగ్, జస్పీందర్ సింగ్, కరణ్‌పాల్ సింగ్, మోహిత్ చౌహాన్, పవన్ కుమార్‌గా గుర్తించారు. వారందరూ ఒకే రాష్ట్రానికి చెందిన విద్యార్థులుగా ప్రాథమికంగా నిర్ధారించారు. కెనడా కాలమానం ప్రకారం.. శనివారం తెల్లవారు జామున 3:45 నిమిషాలకు వెస్ట్ ఒంటారియో ప్రావిన్స్‌లో సంభవించింది. మృతులందరూ టోరంటో యూనివర్శిటీ విద్యార్థులుగా తెలుస్తోంది. వీకెండ్ కోసం వెళ్లి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. విద్యార్థులు ప్రయాణిస్తోన్న ప్యాసింజర్ వ్యాన్ ప్రమాదానికి గురయింది. ఆ సమయంలో వ్యాన్‌లో మొత్తం ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. వారంతా 401 జాతీయ రహదారిపై టోరంటో వైపు వెళ్తోన్న సమయంలో ప్యాసింజర్ వ్యాన్- ట్రాక్టర్ ట్రాలీని అతి వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో హర్‌ప్రీత్ సింగ్, జస్పీందర్ సింగ్, కరణ్‌పాల్ సింగ్, మోహిత్ చౌహాన్, పవన్ కుమార్ అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్నవెంటనే క్వింటె వెస్ట్ ఒంటారియో ప్రావిన్షియల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టమ్ కోసం తరలించారు. భారత హైకమిషన్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని హైకమిషనర్ అజయ్ బిసారియా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, మృతదేహాలను భారత్‌కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
కెనడాలో భారతీయ విద్యార్థుల దుర్మరణం
March 14, 2022
0
Tags