ప్రముఖ నృత్య కళాకారిణి, ఆంధ్ర నాట్య గురువు, పరిశోధకురాలు డాక్టర్ కే సువర్చలాదేవి(53) బుధవారం హఠాన్మరణం చెందారు. ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో ఆమెను బుధవారం ఉదయం హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలో ఆమె గుండెపోటుకు గురై మరణించారు. సువర్చలాదేవి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జన్మించిన సువర్చలా దేవి చిన్న వయసు లోనే నాట్యాభ్యాసం ప్రారంభించారు. సరిదే మాణిక్యమ్మ, డా.నటరాజ రామకృష్ణ లవద్ద ఆంధ్రనాట్యం నేర్చుకున్నారు. ముఖ్యంగా అధ్యాత్మక రామాయణ అభినయంలో ప్రత్యేక కృషి చేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆంధ్రనాట్యంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రెండు దశాబ్దాలుగా నృత్యశాఖ అధ్యాపకురాలిగా సేవలందిస్తున్నారు. తన కుమార్తె సాత్వికను కూడా మంచి నర్తకి గా తీర్చిదిద్దారు. సువర్చలాదేవి మృతి పట్ల యూనివర్సిటీ వీసీ టీ కిషన్ రావు, రిజిస్ట్రార్ భట్టు రమేశ్, లలిత కళాపీఠం పీఠాధిపతి డాక్టర్ కోట్ల హనుమంతరావు, నృత్య శాఖాధిపతి డాక్టర్ వనజ ఉదయ్ సంతాపం ప్రకటించారు.
డాక్టర్ సువర్చలా దేవి మృతి
March 02, 2022
0
Tags