ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఇటీవల పద్మ శ్రీ అవార్డుకి ఎన్నిక కాబడ్డ విషయం తెలిసిందే. ఆయన పలు విషయాలపై ప్రవచనలు చేస్తూ అలరిస్తూ ఉంటారు. అయితే పలుమార్లు ఆయన ప్రవచనాలు వివాదాలలోకి కూడా నెడుతుంటాయి. రీసెంట్‌గా పుష్ప సినిమాపై కూడా ఆయన కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. అయితే దానిని పుష్ప టీమ్ లైట్‌గా తీసుకొని స్పందించలేదు. తాజాగా ఆయన 2006 నాటి వీడియోతో చిక్కుల్లో పడ్డారు. గరికపాటి ఓ ఛానల్‌లో ఏర్పాటు చేసిన హాస్యం అనే కార్యక్రమంలో తమను కించపరిచే విధంగా మాట్లాడారని స్వర్ణకార వృత్తి చేసే విశ్వ బ్రాహ్మణులు గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విశ్వ బ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఆనంద ఫంక్షన్ హాల్‌లో ప్రసంగం ఉండడంతో గరికపాటి అక్కడకు వచ్చారు. విషయం తెలిసిన స్వర్ణకారులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి గరికపాటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వాహనాలను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు జరిపారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులతో గరికపాటి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యల వల్ల స్వర్ణకారులు బాధపడుతుండడం వల్ల వారికి క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు. తప్పుగా మాట్లాడి వుంటే క్షమించాలని కోరారు. దీంతో విశ్వబ్రాహ్మణులు ఆందోళన విరమించారు. 16 ఏళ్ల క్రితం జరిగిన వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదమైంది అన్నారు గరికపాటి. సరదా కోసమే చెప్పాననే, సానుభూతితో మాత్రమే చెప్పానన్నారు. తాను ఏ ఉద్దేశంతో చెప్పినా వారు బాధపడ్డారని.. విశ్వ బ్రాహ్మణ సోదరులు బాధపడితే తన కొడుకు బాధపడినట్లే లెక్క అన్నారు. హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి కాపాడటమే తన లక్ష్యమన్నారు. ఒక్కోసారి ఒక మనిషి బాధపడితే తాను కూడా బాధపడతానన్నారు. ప్రజల ప్రేమతో పద్మ శ్రీ అవార్డు తనకు వచ్చిందన్నారు. వారు ఎంతో బాధపడి ఉంటారని.. అందుకే క్షమాపణలు చెబుతున్నానన్నారు
స్వర్ణకారులకు గరికపాటి క్షమాపణలు
February 26, 2022
0