ఒకే ఆస్తిని ఇద్దరికి రాసిచ్చిన సబ్‌ రిజిస్ట్రార్‌

Telugu Lo Computer
0


తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని వెలిచేరు గ్రామకంఠం రివిజన్‌ సర్వే నంబరు 96/9లో 16 సెంట్లు భూమి కోడూరి సురేష్‌కు 2021 మే 6న తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించింది. ఆ ఆస్తిని తన అవసరాల నిమిత్తం ఈనెల 19న అదే గ్రామానికి చెందిన కారుమూరి రాజాబాబుకు విక్రయించి, రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇదే భూమిని గ్రామ స్థాయి అధికారి, దస్తావేజు లేఖరి ద్వారా వెలిచేరుకు చెందిన కాళ్లకూరి విజయ్‌గుప్తాకు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని బాధితుడు సురేష్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ స్థలానికి హక్కుదారులం మేమంటూ గుప్తా కుటుంబ సభ్యులు ఆదివారం ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సురేష్‌ సోమవారం ఆత్రేయపురం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చేరుకుని ఒకరికి అమ్మిన భూమి ఇంకొకరికి ఎలా రిజిస్ట్రేషన్‌ చేస్తారని విధుల్లో ఉన్న ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ కె.శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. ఇటీవల ఆదాయానికి మించి ఆస్తులున్నాయని గుర్తించిన ఉన్నతాధికారులు ఇక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌ ప్రసాదరావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో ఆ స్థానంలో కె.శ్రీనివాస్‌ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. పరిశీలనా లోపం వల్ల తప్పిదం జరిగింది. ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాం. రిజిస్ట్రేషన్‌ కోసం తప్పుడు ధ్రువపత్రాలు అందించినట్లు పరిశీలనలో తేలింది. రిఫ్యూజల్‌ ఆర్డర్‌ వేసి అసలు వారసులకు న్యాయం చేస్తాం అని ఆత్రేయపురం ఇంఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌  కె.శ్రీనివాస్‌ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)