పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన పీకే-9754 విమానం జనవరి 16న సౌదీఅరేబియాలోని రియాద్ నుంచి పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే మార్గమధ్యలో వాతావరణం సహకరించక విమానాన్ని సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. తిరిగి ప్రయాణం కొనసాగించాల్సిన సమయానికి పైలట్ లలో ఒకరు తన షిఫ్ట్ టైం ముగిసిందని, విమానం నడిపేందుకు రాలేనని తాపీగా హోటల్ కు వెళ్ళిపోయాడు. దీంతో కంగుతిన్న కో-పైలట్ విషయాన్నీ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ విమానం దిగబోమని, తమ గమ్యస్థానాలకు చేర్చాల్సిందే అంటూ పట్టుబట్టారు. పరిస్థితి చేయిదాటి పోతుండడంతో ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అప్రమత్తం అయి ప్రయాణికులకు సర్ది చెప్పారు. అనంతరం వారందరికీ స్థానిక హోటల్ లో బస ఏర్పాటుచేసి, పైలట్ తిరిగి వచ్చాక ప్రయాణం కొనసాగించారు. దీనిపై పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ ప్రతినిధి స్పందిస్తూ పైలట్లకు విశ్రాంతి ఎంతో అవసరమని, తమ పైలట్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని వెనకేసుకొచ్చింది.
విమానాన్ని మధ్యలో వదిలేసి పోయిన పైలట్
January 21, 2022
0
Tags