సౌతాఫ్రికాతో ఎదురైన ఓటమి తమకు ఓ గుణ పాఠం లాంటిదని టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ప్రత్యర్థికి అదనంగా 20 పరుగులిచ్చామని, అవే తమ ఓటమిని శాసించాయని తెలిపాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో సమష్టిగా విఫలమైన భారత జట్టు 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై స్పందించిన రాహుల్ స్వీయ తప్పిదాలతోనే మూల్యం చెల్లించుకున్నామన్నాడు. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ అందించిన కీలక భాగస్వామ్యాన్ని కొనసాగించలేకపోయామని, మిడిలార్డర్ వైఫల్యం జట్టు విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. 'ఇదో అద్భుత గేమ్. ఈ ఓటమి ఓ గుణ పాఠంలాంటింది. ఈ మ్యాచ్‌ను అద్భుతంగా ఆరంభించాం. కానీ మిడిల్‌లో వికెట్లు తీయలేకపోయాం. ఎంత సేపు వికెట్లు ఎలా తీయాలి, ప్రత్యర్థిని ఎలా అడ్డుకోవాలా? అనేదే చూశాం. చేజింగ్‌లో 20-25 ఓవర్ల వరకు మ్యాచ్‌లో ఉన్నాం. ఆ దశలో సునాయసంగా గెలుస్తాం అనుకున్నాం. కానీ మిడిలార్డర్ వైఫల్యం కొంపముంచింది. సౌతాఫ్రికా అద్భుతంగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీసింది. నేను 20 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయలేకపోయాను. పిచ్ అంతగా మారుతుందని ఊహించలేకపోయాను. కానీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని విరాట్, శిఖర్ చెప్పారు. క్రీజులో సెట్ అయితే వికెట్ బ్యాటింగ్‌కు సహకరిస్తుందని తెలిపారు. దురదృష్టవశాత్తు మిడిలార్డర్‌లో మేం నిలదొక్కుకోలేకపోయాం. భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. కానీ సఫారీ ఆటగాళ్లు పరిస్థితులను అద్భుతంగా అర్థం చేసుకున్నారు. మా బౌలర్లపై ఒత్తిడి పెంచారు. దాంతో మేం మిడిల్‌లో వికెట్లు తీయలేకపోయాం. 290 ప్లస్ టార్గెట్‌లో 20 పరుగులు ఎక్కువగా ఇచ్చాం. కానీ మిడిల్‌లో భాగస్వామ్యాలు నెలకొల్పాల్సింది. సిరీస్‌లో మాకు ప్రతీ గేమ్ ముఖ్యమే. విజయం కోసం మా సాయశక్తులా కృషిచేస్తాం. ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకునే టీమ్‌కాంబినేషన్‌ను పరీక్షిస్తున్నాం. మేమంతా తప్పులు చేశాం. కానీ వాటి త్వరగా సరిదిద్దుకుంటాం'అని రాహుల్ తెలిపాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. కెప్టెన్ టెంబా బవుమా(143 బంతుల్లో 8 ఫోర్లతో 110), రాసీ వాన్ డెర్ డస్సెన్(96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్స్‌లతో 129 నాటౌట్) సెంచరీలతో చెలరేగారు. నాలుగో వికెట్‌కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ తీశాడు. అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. శిఖర్ ధావన్ (84 బంతుల్లో 10 ఫోర్లతో 79), విరాట్ కోహ్లీ (63 బంతుల్లో 3 ఫోర్లతో 51), శార్దూల్ ఠాకూర్ (43 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి, షంసీ, పెహ్లుక్వాయో రెండేసి వికెట్లు తీయగా.. మహరాజ్, మార్‌క్రమ్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది.
20 పరుగులే ఓటమిని శాసించాయి
January 20, 2022
0
Tags