ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరలను తగ్గిస్తే, తెలంగాణలో రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. మరోవైపు ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. టికెట్ ధరల తగ్గింపును సవాల్ చేస్తూ ఏపీలో పలు థియేటర్‌ల యజమానులు హైకోర్టు ఆశ్రయించగా, జీవో నెం.35ను న్యాయస్థానం రద్దు చేసింది. ఈ వ్యవహారం ఇంకా కోర్టు విచారణలో ఉంది. దీనిపై జనవరి 4న తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో పలు థియేటర్‌లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిబంధనలను అతిక్రమించి వాటిని సీజ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇంకొన్ని థియేటర్లను స్వచ్ఛందంగా మూసి వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్‌లు టికెట్‌రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ తెలంగాణ సర్కారు అనుమతి ఇవ్వడం గమనార్హం. ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు, గ్రామ పంచాయతీలకు ప్రాంతాల వారీగా సినిమా టికెట్ల ధరను ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ధరల ప్రకారం టికెట్ ధర రూ.5 నుంచి రూ.250 వరకు ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లల్లో మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75; ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40; నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20. మున్సిపాలిటీలలో మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60; ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30; నాన్ ఏసీ- ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15. నగర పంచాయతీలలో మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40; ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15; నాన్ ఏసీ- ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10. గ్రామ పంచాయతీలలో మల్టీప్లెక్స్-ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30; ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10; నాన్ ఏసీ- ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5గా నిర్ణయించారు.
తెలంగాణలో ఏసీ థియేటర్‌లలో కనిష్ఠ ధర రూ.50 కాగా, గరిష్ఠంగా రూ.150గా టికెట్ ధరను నిర్ణయించారు. (జీఎస్టీ అదనం), మల్టీప్లెక్స్‌ల్లో కనీస టికెట్ ధర రూ.100+జీఎస్‌టీ.. గరిష్ఠంగా రూ.250+జీఎస్‌టీగా ధరను ఖరారు చేశారు. సింగిల్ థియేటర్లలో స్పెషల్ రిక్లైనర్ సీట్లకు రూ.200+ జీఎస్‌టీ.. మల్టీప్లెక్స్‌లలో రూ.300+ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్‌లలో రూ.5, నాన్ ఏసీకి రూ.3 వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.