నవంబర్ 25వ తేదీన కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ శివమొగ్గ జిల్లాలో పర్యటించారు. గెహ్లాట్ నగరంలో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం జోగ్ ఫాల్స్ కు వెళ్లి, అక్కడ సమీపంలోని ఓ గెస్ట్ హౌస్ లో బస చేశారు. గురువారం ఉదయం జోగ్ జలపాతాన్ని సందర్శించారు. దాదాపు 830 అడుగులకు పైగా ఎత్తునుంచి జలపాతాన్ని వీక్షించారు. కొద్దిసేపు ఉన్న అనంతరం గవర్నర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఉదయం 6 గంటల ప్రాంతంలో లింగనమక్కి డ్యాం నుంచి దాదాపు 200 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జలపాతం వద్దకు చేరేందుకు దాదాపు మూడు గంటల సమయం పడుతుందని అంచనా. జలపాతానికి కాస్తా జలకళను తీసుకొచ్చిపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని నిమిషాల పాటు ఆహ్లాదకరంగా ఉన్న గవర్నర్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయన వెళ్లిపోయిన అనంతరం నీటి విడుదలను ఆపేశారు. కానీ..రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసే సమయంలో..కింద ఉన్న గ్రామాల వాసులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. కానీ..అలా ఏమీ చెప్పకుండానే నీటిని విడుదల చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నీటి విడుదల తెలుసుకున్న గ్రామస్థులు అలర్ట్ అయ్యారు. శరావతి నది దిగువన ఉన్న నివాసితులకు సమాచారం ఇవ్వకుండానే.. నీటిని విడుదల చేయాలని సీనియర్ కేపీసీఎల్ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించేందుకు శరావతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ లింగనమక్కి నిరాకరించినట్లు తెలుస్తోంది. విడుదల చేసిన నీటితో దాదాపు 2 వేల యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేయొచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.
జలపాతాన్ని వీక్షించేందుకు నీరు విడుదల!
November 27, 2021
0
Tags