ఖాకీ మాటున మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఏపీఎస్పీ రెండో పటాలానికి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్ల గుట్టు రట్టయింది. ఈ ఉదంతం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో సంచలనంగా మారింది. ఏపీఎస్పీ రెండో పటాలంలోని ఆసుపత్రికి చెందిన డాక్టర్ కోటయ్య ఆసుపత్రికి అవసరమైన మందుల కోసం హైదరాబాద్ వెళ్లారు. పటాలం అధికారులు ఆయనకు సుమో వాహనాన్ని ఏర్పాటు చేసి డ్రైవర్‌గా కానిస్టేబుల్ బేస్త శ్రీనివాసులును నియమించారు. శుక్రవారం సాయంత్రం తిరిగి వస్తుండగా హైదరాబాద్ శివారులో కర్నూలు వచ్చేందుకు రెండో పటాలానికి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఎక్కారు. మార్గమధ్యలో అలంపూర్ సమీపంలోని హైవే పక్కన వేచి ఉన్న అదే పటాలానికి చెందిన మరో కానిస్టేబుల్ బేస్త శివరాముడు ఆ సుమోలో రెండు కేసుల మద్యం ఎక్కించారు. దీనిని గమనించిన తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా నిఘా పోలీసులు ఇక్కడి సెబ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సుమో ముందు వెనుక పోలీసు అని రాసి ఉండటంతో వాహనాన్ని చెక్‌పోస్టు వద్ద ఆపరని కానిస్టేబుల్ శ్రీనివాసులు భావించాడు. కర్నూలు మండలం పంచలింగాల అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం వద్దకు చేరుకోగానే సెబ్ అధికారులు వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా రెండు కేసుల (60 సీసాలు) మద్యం సీసాలతోపాటు విడిగా రెండు ఖరీదైన మద్యం సీసాలు బయటపడ్డాయి. వాహనంలో ఉన్న అందరినీ సెబ్ జాయింట్ డైరెక్టర్ తుహిన్‌సిన్హా ఎదుట హాజరుపరిచి విచారించగా కానిస్టేబుల్ శ్రీనివాసులు నేరం అంగీకరించాడు. కర్నూలు వచ్చేందుకు ఎక్కిన ఇద్దరు కానిస్టేబుళ్ల ప్రమేయం ఏమీ లేదని నిర్ధారణ కావటంతో వారిని వదిలిపెట్టారు. జాయింట్ డైరెక్టర్ ఆదేశాలమేరకు మద్యం తెచ్చిన కానిస్టేబుల్ శ్రీనివాసులు, మద్యం అప్పగించిన శివరాముడుపై కర్నూలు సెబ్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. శ్రీనివాసులుతోపాటు శివరాముడిని అరెస్టు చేసి శనివారం ఇద్దరినీ రిమాండ్‌కు పంపారు. వాహనం సీజ్ అయి కేసులో ఇరుక్కుపోవటంతో పటాలం పోలీసు అధికారులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. వీరు తాగేందుకు తెచ్చుకుంటున్నారా? లేదా? అమ్మకానికి తెచ్చారా? అన్నది దర్యాప్తులో తేలనుంది. నిందితులు పోలీసు శాఖ ఉద్యోగులు కావటంతో అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచారు.
పోలీసు వాహనంలో తెలంగాణ మద్యం తరలింపు
November 07, 2021
0