శంకరాభరణం, యమగోల, పదహారేళ్ల వయసు, మావిచిగురు, గ్యాంగ్ లీడర్, శుభసంకల్పం, ఆపద్బాంధవుడు, స్వాతిముత్యం తదితర చిత్రాల్లో వయసు మీద పడినా ఓపికతో నటించిన ఆమె అనంతరం ఆరోగ్యకారణాలతో నటన విరమించుకున్నారు. స్నేహం కోసం చిత్రం తరువాత ఆమె దాదాపు నటించటం మానేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి బలవంతం మీద ఆమెను చివరి చిత్రం ప్రేమకు ఆహ్వానంలో నటించడానికి ఒప్పించారు.
నిర్మలమ్మకు పందొమ్మిదేళ్ళ వయసులో జీవీ కృష్ణారావుతో వివాహం జరిగింది. ఈయన ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసేవారు. ఆమె దత్త పుత్రిక పేరు కవిత. అల్లుడు డి.యస్. ప్రసాద్.
షూటింగ్ విరామ సమయంలో మమ్మల్ని తల్లిలా ఆదరించేది. అందకూ మేమందరం ఆమెను ఆప్యాయంగా నిర్మలమ్మ (నిర్మల+అమ్మ) అని పిలుచుకునే వాళ్ళం. — అక్కినేని నాగేశ్వరరావు
కాకినాడలో కరువు రోజులు అనే నాటకం చూసిన అలనాటి బాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ కపూర్ నిర్మలమ్మను గొప్ప నటివవుతావని చెప్పారు. ఈ సంఘటనను నిర్మలమ్మ చాలా సందర్భాల్లో గుర్తు చేసుకునేది.
ఏక వీర నాటకంలో గిరిక పాత్రను వేసిన నిర్మలమ్మను చూసిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పిచ్చిమొద్దూ! నీలో ఇంత నటన ఉందని అనుకోలేదు అంటే అమాయకంగా నవ్విందట నిర్మలమ్మ.
నిర్మలమ్మ ఆడపెత్తనంలో హీరోయిన్ గా చేయాల్సింది. కానీ అది కుదర్లేదు. తర్వాత ఆమె గరుడ గర్వభంగంలో హీరోయిన్ గా చేసింది కానీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ ఆమెకు నటిగా పేరు తెచ్చింది మాత్రం మనుషులు మారాలి అనే చిత్రం. ఆ సినిమా శతదినోత్సవాలకు వెళ్ళిన హిందీ నటుడు ప్రాణ్. నువ్వు శోభన్ బాబు కే అమ్మ కాదు. భారత్ కీ మా! అని అన్నారు. అప్పట్లో ఆయనతో నాలుగు ముక్కలు హిందీలో మాట్లాడలేకపోయానని ఆమె విచారిస్తుండేది. అనారోగ్య కారణంగా హైదరాబాదులో 2009 ఫిబ్రవరి 19న మృతిచెందారు.
