కోవిడ్ రెండో దశ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం అవసరమైన ఆక్సిజన్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ డిమాండ్ చేసిందని ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆడిట్ ప్యానెల్ మధ్యంతర రిపోర్ట్ లో తేల్చినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ నేత సంబిత్ పాత్రా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ పీక్ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ మరియు ఢిల్లీ ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరాను రాజకీయం చేశాయని చూడటం నమ్మశక్యం కాదు. ఇవి దిగజారుడు రాజకీయాలు. రిపోర్ట్ లో ఆక్సిజన్ ఆడిట్ కమిటీ సమర్పించిన డేటా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కేజ్రీవాల్ అబద్దాల కారణంగా 12 రాష్ట్రాలు ఆక్సిజన్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నాయి. కేజ్రీవాల్ అబద్దాల కారణంగా ఆక్సిజన్ ట్యాంకర్లు రోడ్లపై నిలిచిపోయాయి. ఈ ఆక్సిజన్ ను ఇతర రాష్ట్రాల్లో వినియోగించబడినట్లయితే చాలా మంది ప్రాణాలు కాపాడబడి ఉండేవి. కేజ్రీవాల్ ఘోరమైన నేరానికి పాల్పడ్డారు అని సంబిత్ పాత్ర ఆరోపించారు.
బీజేపీ చెప్తున్నట్లు ఏ రిపోర్ట్ లేదని ఇదంతా ద్వేషపూరిత మరియు అసత్య ప్రచారమంలో భాగమని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు.
