ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి యూరప్ పర్యటనకు అనుమతి వేళ సీబీఐ కోర్టు తన ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ సహా పర్యటన వివరాలను సమర్పించాలనే షరతులు విధిస్తూ అనుమతి మంజూరు చేసింది. విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంత సెల్ నెంబర్‌కు బదులు మరో నెంబర్ ఇచ్చారంటూ కోర్టులో దాఖలు చేసిన మెమోలో సీబీఐ స్పష్టం చేసింది. ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘించారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. అందుకు కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరఫు న్యాయవాదికి సీబీఐ కోర్టు ఆదేశించింది. జగన్ తన కుమార్తెల వద్దకు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇందు కోసం కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారు. జగన్ పిటీషన్ పైన విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు యూరప్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. అక్టోబరు 1 నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల పాటు యూరప్ వెళ్లేందుకు పలు షరతులతో అనుమతి మంజూరు చేసింది. అదే సమయంలో... పర్యటన ముగిసిన అనంతరం స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో.. ఈ నెల 11వ తేదీన జగన్ యూరప్ వెళ్లారు. పర్యటన అనుమతి సమయంలోనూ కోర్టులో విచారణ జరిగింది. ఆ సందర్భంగా జగన్ ఎన్నడూ కోర్టు షరతులను ఉల్లంఘించలేదని ఆయన తరఫు న్యాయవాది పేర్కొనగా సీబీఐ తరఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనితో విభేదించారు. దీంతో కోర్టు షరతులతో అనుమతి ఇచ్చింది.
జగన్ బెయిల్ షరతులను ఉల్లంఘించారు : సీబీఐ పిటిషన్ దాఖలు
October 16, 2025
0
Tags