గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్ నగరం !

Telugu Lo Computer
0


హైదరాబాదులోని నోవాటెల్‌లో జరిగిన జీసీసీ సమావేశంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ ఈరోజు హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు రాజధానిగా మారడం వెనక గత ప్రభుత్వం కృషి ఎంతగానో ఉన్నదని, పది సంవత్సరాలపాటు అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో హైదరాబాద్‌ నగరాన్ని సమగ్రంగా తీర్చిదిద్దడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తుల ఆధారంగా కాకుండా శాశ్వతంగా మంచి ఫలితాలు వచ్చేలా వ్యవస్థలను, చట్టాలను, సంస్కరణలను తీసుకురావడం వలన తెలంగాణ వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో అగ్రస్థానంలో నిలిచింది అని కేటీఆర్ గుర్తు చేశారు. అందుకే బ్యాంకింగ్, ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ ఇవన్నీ రంగాల్లో భారీగా పెట్టుబడులను, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించగలిగింది. హైదరాబాద్‌లో అనేక అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఉపయోగించుకొని మరింత పెట్టుబడులు వచ్చేలా తమ తమ పరిధిలో కృషి చేయాలని చార్టెడ్ అకౌంటెంట్‌లకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న సంస్కరణల యుగంలో ఆర్థిక కార్యకలాపాల పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న చట్టాల నేపథ్యంలో చార్టెడ్ అకౌంటెంట్ల ప్రాధాన్యత బాగా పెరిగిందని, వీరంతా దేశంలో డిజిటల్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్‌కు సంబంధించిన రంగంలో కీలకంగా మారారని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావాలని ఎల్లప్పుడూ కోరుకుంటామని తెలిపిన కేటీఆర్, ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా యొక్క గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సమ్మిట్‌కి తనను ఆహ్వానించినందుకు నిర్వాహకులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)