ఢిల్లీ నుంచి ఇండోర్ కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలోని ఇంజిన్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ల్యాండింగ్ ముందు సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నం చేశాడు. అయితే ఎయిర్ ఇండియా విమానం దాదాపు 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టినట్లు సమాచారం. ప్రమాద సమయంలో విమానంలో 161 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తిన వెంటనే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భద్రత కారణంగా విమానాన్ని ఇండోర్ విమానాశ్రయంలో పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో సాంకేతిక సమస్య, ల్యాండింగ్ వివరాలు పైలట్ ఏటీసీ కార్యాలయానికి సమాచారం అందించారు. వెంటనే ఫైర్ బ్రిగేడ్, అంబులెన్స్, సీఐఎస్ఎఫ్ టీమ్స్ ను మోహరించారు అధికారులు. శుక్రవారం ఉదయం 9 గంటల 54 నిమిషాలకు విమానం ల్యాండింగ్ అయింది. టెక్నికల్ టీమ్ ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత విమానాన్ని ఢిల్లీకి పంపించారు. అయితే ఇదే విమానం ఇండోర్ నుంచి ఢిల్లీకి ప్రయాణికులతో చేరాల్సి ఉండగా.. సాంకేతిక సమస్య కారణంగా విమానం రద్దు అయింది. దీంతో విమానాన్ని ఖాళీగానే తిరిగి ఢిల్లీ పంపించారు. మరోవైపు నాగ్‌పూర్ నుంచి కోల్ కతా వెళ్తున్న ఇండిగో విమానాన్ని అధికారులు అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం 6E 812 గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే పక్షి ఢీ కొట్టింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని నాగ్‌పూర్ విమానాశ్రయం సీనియర్ డైరెక్టర్ అబిద్ రుహి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
September 05, 2025
0
Tags