బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ

Telugu Lo Computer
0


తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 16న టీటీడీ పాలన మండలి సమావేశం కానుంది. బ్రహ్మోత్స వాల నిర్వహణతో పాటుగా వసతి - సేవల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకోన్నారు.  తిరుమలలో ఈ నెలాఖరు వరకు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. బ్రహ్మోత్సవాలు ఉండటంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకోనున్నారు. ఈ నెల 15న తిరుమల ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. 16వ తేదీన టీటీడీ బోర్డు సమావేశం జరగనుంది. 16వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అందులో భాగంగా 15వ తేదీన సిఫారసు లేఖలను స్వీకరించరని అధికారులు వెల్లడించారు. బ్రహ్మోత్సవాలకు ఆలయ శుద్దిలో భాగంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.16న జరిగే బోర్డు సమావేశంలో బ్రహ్మోత్సవాలు, వసతి సౌకర్యం పెంపుతో పాటుగా చేయాల్సిన మార్పుల పైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బ్రహ్మోత్సవాల వేళ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానుండటంతో ముందస్తు ఏర్పాట్ల పైన సమీక్ష చేయనున్నారు. ఇప్పటికే బ్రహ్మోత్సావాలను కన్నులపండువగా నిర్వహించేందుకు అధికారులు సమిష్టిగా పనిచేయాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు జరుగునున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ, పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేయాలని ఆయన వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సమయంలో మాడ వీధులను పరిశుభ్రంగా ఉంచేందుకు అదనంగా అవసరమైనంత సిబ్బందిని తీసుకోవాలని ఆదేశించారు. గరుడ వాహనం రోజున సీనియర్ అధికారులకు మాడవీధుల్లో విధులు కేటాయించి భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను సేకరించాలన్నారు. గ్యాలరీలల్లోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో అవసరమైన మేరకు వాహనాల కోసం పటిష్ట పార్కింగ్ సదుపాయం కల్పించాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలో కూడా ప్రత్యేక పార్కింగ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. నాదనీరాజనం వేదికపై పేరొందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. దాదాపు 3500 మంది శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సమర్థవంతంగా పని చేసే శ్రీవారి సేవకులను గుర్తించి బ్రహ్మోత్సవాల్లో వారి సేవలను వినియోగించుకోవాలని నిర్దేశించారు. శ్రీవారి మెట్టు, అలిపిరి నడకమార్గాల్లో మరింత అప్రమత్తంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)