జెయింట్ లాజిస్టిక్ కంపెనీ బ్లాక్ బక్ బెంగళూరులో ట్రాఫిక్ ఇబ్బందులు, అధ్వానంగా మారిన రోడ్ల కారణంగా ఇక్కడి నుంచి వెళ్లిపోనుంది. తొమ్మిది సంవత్సరాలుగా బెల్లందూరు అవుటర్ రింగ్ రోడ్డులో గల ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయనుంది. రోజురోజుకూ ట్రాఫిక్ పెరిగిపోతోండటం, రోడ్లు అత్యంత దయనీయంగా మారడం, ఆఫీస్ కు వెళ్లడానికి ఉద్యోగులకు గంటన్నరకు పైగా సమయం పడుతోండటం వల్ల ఈ నిర్ణయానికొచ్చింది. ఈ విషయాన్ని బ్లాక్‌బక్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ యాబాజీ వెల్లడించారు. తమ కంపెనీని ఇక్కడి నుండి మార్చనున్నట్లు తెలిపారు. ఇక్కడి మౌలిక సదుపాయాలు, రోడ్ల నిర్వహణ, ట్రాఫిక్ పరిస్థితు మెరుగుపడే అవకాశం లేదని ఆయన నిరాశ వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. బ్లాక్‌బక్ లాజిస్టిక్ టెక్నాలజీ ప్లాట్‌ఫాం. బెంగళూరు ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తోందీ సంస్థ. బెల్లందూరు అవుటర్ రింగ్ రోడ్ సమీపంలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం చాలాకాలం నుంచి కొనసాగుతోంది. బెంగళూరులో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఇదొకటి. వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోజువారీ ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుండటంతో ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాజేష్ యాబాజి తెలిపారు. ప్రస్తుతం అక్కడ కొనసాగడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. ఆఫీస్ కు రావడానికి ఉద్యోగులకు గంటన్నరకు పైగా సమయం పడుతోందని తెలిపారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ గుంతలు ఉన్నాయని, దుమ్ము ధూళితో నిండి పోయాయని, వాటిని సరిచేయడానికి పెద్దగా ప్రయత్నాలు జరగట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే అయిదేళ్లలో కూడా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదని అన్నారు. బెంగళూరు బెల్లందూర్ ఆఫీస్ తమకు ఇంటితో సమానమని యాబాజి ట్వీట్ చేశారు. ఇప్పుడిక్కడ కొనసాగడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు. రోజువారీ ప్రయాణం గానీ, ఇతర కార్యకలాపాలు గానీ గగనం అయ్యాయని పేర్కొన్నారు. అందుకే ఇక్కడి నుంచి తరలిపోవాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. రాజేష్ యాబాజి ట్వీట్‌కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది. బెలందూర్‌లో ఆస్తుల రేట్లు భారీగా పెరిగాయని, మౌలిక సదుపాయాల కొరత ఉన్నా బిల్డర్లు చికాగో, దుబాయ్ స్థాయి ధరలు చెబుతున్నారని యోగేష్ అనే యూజర్ విమర్శించాడు. బెలందూర్‌లో ట్రాఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ కంపెనీలు అక్కడే ఎందుకు ఉంటున్నాయని అనిరుద్ధ్ అనే మరో యూజర్ ప్రశ్నించాడు. ట్రాఫిక్ చిక్కుల్లోనే ప్రెస్టీజ్, సత్వ వంటి సంస్థలు కొత్త టెక్ పార్కులను నిర్మించడం అసంబద్ధమని అన్నాడు.
బెంగళూరు నుంచి తరలిపోనున్న జెయింట్ లాజిస్టిక్ కంపెనీ బ్లాక్ బక్
September 17, 2025
0
Tags