విజయవాడలో కనకదుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దర్శనం కోసం అమ్మవారి సన్నిధానం నుంచి వినాయకుని గుడి వెలుపల కిలో మీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. ఈ రోజు దుర్గమ్మ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ రోజు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాగా, రద్దీ వేళ దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు కీలక సూచనలు చేసారు. వినాయకుని గుడి వెలుపల ఉన్న భక్తుల మధ్య తొక్కిసలాట జరగకుండా టీటీడీ తరహాలో కంపార్ట్‌మెంట్ల వారీగా భక్తులను అనుమతిస్తున్నారు. క్యూలైన్స్ నిండిపోవడంతో ఘాట్ రోడ్‌లోకి భక్తులను పోలీసులు వదిలారు. ఇప్పటి వరకు దుర్గమ్మను 75 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. కాగా, ఇవాళ సరస్వతి దేవి దర్శనార్ధం మూడు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. అంతేకాకుండా ఈరోజు వీఐపీ, వీవీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశారు. రద్దీ వేళ ఆలయ అధికారులు 300, 100 రూపాయల టిక్కెట్లతో పాటు అంతరాలయ దర్శనం రద్దు చేశారు. అన్ని ఉచిత దర్శనాలనే అధికారులు కల్పిస్తున్నారు. కాగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం 03.30 గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను సీఎం సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఆలయం వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మూల నక్షత్రం కావడంతో, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రకాశం బ్యారేజి పై వాహన రాకపోకలు ను ఆదివారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు పూర్తిగా నిషేదించారు. క్యూలైన్ కొండ కింద వరకూ విస్తరించి ఉంది. బస్సులను కూడా పైకి అనుమతించరు. కేవలం ముఖ్యమంత్రి వాహనాన్ని తప్పించి ఏ వాహనాన్ని అనుమతించరు.
కనకదుర్గమ్మ దర్శనం కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు
September 29, 2025
0
Tags