ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్‌ ఉంటుంది - నిరుద్యోగులు ప్రిపేర్‌ అవుతూ ఉండాలి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని వెలగపూడి, సచివాలయం సమీపంలో మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 15,941 మందికి నియామక పత్రాలను అందజేసి మాట్లాడుతూ మెగా డీఎస్సీ సాధ్యమా అన్నారు, మెగా డీఎస్సీని సూపర్‌ హిట్‌ చేసి చూపించాం. ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్‌ ఉంటుంది, నిరుద్యోగులు ప్రిపేర్‌ అవుతూ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే పెట్టానని గుర్తు చేశారు. టీచర్లుగా నియామక పత్రాలు తీసుకున్న అందరిని అభినందించారు. అవినీతి లేకుండా పారదర్శకంగా డీఎస్సీ ప్రక్రియ చేపట్టి టీచర్ల నియామకాలు చేశామని వెల్లడించారు. బాబు ష్యూరిటీ - జాబు గ్యారెంటీ అని చెప్పాను.. దాన్ని నిజం చేస్తున్నానన్నారు. రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని 10 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. 15 ఏళ్లల్లో 14 సార్లు డీఎస్సీ పెట్టి 1,96,619 ఉద్యోగాలిచ్చామని పేర్కొన్నారు. ఏపీలో ఓ చేతకాని పక్షం ఉంది. మంచి చేయరు, మంచి జరుగుతుంటే చూసి ఓర్వలేరని మండిపడ్డారు. డీఎస్సీని అడ్డుకునేందుకు 106 కేసులు వేశారు. కానీ, ఇబ్బందులను అధిగమించి డీఎస్సీ నిర్వహించిన లోకేశ్‌ టీంను అభినందించారు. మహిళలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని వెల్లడించారు. ప్రధాని సూపర్ జీఎస్టీ తెచ్చి ధరలు తగ్గించారని అన్నారు. పోస్టింగుల కోసం పైరవీలు చేసే పరిస్థితి గతంలో ఉండేది. కానీ తెదేపా ప్రభుత్వంలో ఎప్పుడూ ప్రతిభ ఆధారంగానే పోస్టింగులు ఇచ్చామని తెలిపారు. విద్యా రంగంలో సంస్కరణలు తెస్తున్నామని, సన్న బియ్యంతో రుచికరమైన మధ్యాహ్నాభోజనం అందిస్తున్నామని తెలిపారు. పేరెంట్- టీచరు మీటింగులు నిర్వహిస్తున్నాం.. మన బడి-మన భవిష్యత్ పేరుతో మౌలిక సదుపాయాల కల్పన చేపడుతున్నామని అన్నారు. టీచర్ల బదిలీల చట్టంతో పారదర్శకంగా ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తి చేశామని గుర్తు చేశారు. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా... ప్రతి ఒక్కరికి రూ.15 వేలు చొప్పున ఇచ్చామని వెల్లడించారు. నారా లోకేశ్‌.. నో బ్యాగ్ డే విధానం తెచ్చారని ఇది వినూత్నంగా ఉందన్నారు. ఈసారి స్కూళ్లు తెరిచేలోగానే స్కూల్ కిట్లు, పుస్తకాలు ఇచ్చామని తెలిపారు. అభివృద్ధితో ఉద్యోగాలు వస్తాయి... ఆదాయం పెరుగుతుంది. సంక్షేమం సజావుగా సాగించవచ్చని స్పష్టం చేశారు. విలువలతో కూడిన విద్యను అందించేలా టీచర్లంతా పని చేయాలని సూచించారు. పిల్లల్లో నైతిక విలువలను పెంచేలా టీచర్లు పాఠాలు చెప్పాలన్నారు. పిల్లల్లో నైపుణ్యాలు పెంచే బాధ్యత టీచర్లు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో విద్యా రంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయననేది టీచర్లు ఊహించగలగాలని తెలిపారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా టీచర్లు అప్డేట్ అవుతూ ఉండాలన్నారు. నేను నిత్య విద్యార్థిని, కొత్త విషయాలు నేర్చుకుంటాను, ప్రజలకు ఉపయోగపడతాయనుకుంటే వాటిని అమలు చేస్తానన్నారు. 2019-24 మధ్య కాలం విద్యా వ్యవస్థకు ఓ శాపం, 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోయారు. ఏపీ విద్యా రంగాన్ని 19వ స్థానానికి దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ మీడియం పేరుతో ప్రాథమిక విద్యా వ్యవస్థను నాశనం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయని వెల్లడించారు. నో అడ్మిషన్లు బోర్డులు పెట్టే స్థాయికి ప్రభుత్వ పాఠశాలలను తెచ్చారు. ఇది మరింతగా పెరగాలని అభిప్రాయపడ్డారు. విద్యా శాఖ కఠినంగా ఉంటుందని చెప్పాను. అయినా లోకేశ్‌ ఛాలెంజ్‌గా తీసుకున్నారన్నారు. ప్రాథమిక విద్య బాగుంటే ఉన్నత చదువులు అద్భుతంగా ఉంటాయి. దీంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖమంత్రి నారా లోకేశ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మెగా డీఎస్సీ విజేతలు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)