యూఎస్ ఓపెన్‌లో ఫైనల్లో సినర్, అల్కరాజ్ !

Telugu Lo Computer
0


యూఎస్ ఓపెన్‌లో సెర్బియా దిగ్గజం నోవాక్ జకోవిచ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. 25వ గ్రాండ్ స్లామ్ టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన జకోవిచ్ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. రెండో సీడ్, వరల్డ్ నెంబర్ 2 కార్లోస్ అల్కరాజ్ చేతిలో జకోవిచ్‌ ఓటమిపాలయ్యాడు. మరోసారి టాప్-2 ర్యాంకర్స్ అయిన జనిక్ సినర్, కార్లోస్ అల్కరాజ్‌లే ఫైనల్ చేరారు. సెమీస్‌లో కెనడా ప్లేయర్ ఫెలిక్స్ అగర్ అలియాసిమ్‌ను ఇటాలియన్ ప్లేయర్ జనిక్ సినర్ ఓడించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో సినర్, అల్కరాజ్ విజయం సాధించి ఫైనల్ చేరారు. తొలి సెమీఫైనల్లో జనిక్ సినర్ 6-1, 3-6, 6-3, 6-4 తేడాతో అలియాసిమ్‌ను ఓడించాడు. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో జనిక్ సినర్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. అయితే రెండో సెట్‌లో అలియాసిమ్ నుంచి సినర్‌కు ప్రతిఘటన ఎదురైంది. ఈ సెట్‌ను అలియాసిమ్ గెలుచుకున్నా.. ఆ తర్వాత తన అనుభవంతో సినర్ పుంజుకున్నాడు. తర్వాతి రెండు సెట్లను గెలుచుకొని ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ మ్యాచ్‌లో జనిక్ సినర్ 11 ఏస్‌లు కొట్టగా.. అలియాసిమ్ 9 ఏస్‌లు కొట్టాడు. జానిక్ సిన్నర్ 4 బ్రేక్ పాయింట్స్ సాధించగా.. అలియాసిమ్ ఒకే ఒక్క బ్రేక్ పాయింట్ గెలిచాడు. ఈ విజయంతో ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ పోటీల్లో ఫైనల్‌కు చేరిన ఆటగాడిగా సినర్ నిలిచాడు. రెండో సెమీస్‌లో అల్కరాజ్ 6-4, 7-6(7/4), 6-2 తేడాతో జకోవిచ్‌ను చిత్తు చేశాడు. 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన జకోవిచ్‌ను మూడు సెట్లలో అల్కరాజ్ మట్టికరిపించాడు. ఈ మ్యాచ్‌లో జకోవిచ్ 4 ఏస్‌లు కొట్టగా.. అల్కరాజ్ 7 ఏస్‌లు కొట్టాడు. కార్లోస్ అల్కరాజ్ 4 బ్రేక్ పాయింట్స్ సాధించగా.. జకోవిచ్ ఒక బ్రేక్ పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ 101 పాయింట్స్ గెలవగా.. జకోవిచ్ 81 పాయింట్స్ మాత్రమే గెలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో జనిక్ సినర్‌తో తలపడనున్నాడు. గత 37 మ్యాచ్‌ల్లో 36 సార్లు గెలిచిన అల్కరాజ్ కేవలం సినర్ చేతిలో మాత్రమే ఓడాది. అది కూడా గత వింబుల్డన్ ఫైనల్ కావడం గమనార్హం. ఇప్పుడు మళ్లీ సినర్‌తోనే యూఎస్‌ ఓపెన్ టైటిల్ కోసం అల్కరాజ్ పోటీ పడనున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)