వాణిజ్య నౌకల రాకపోకల వల్లే ఎర్ర సముద్రంలో కేబుల్స్‌ కట్‌ ?

Telugu Lo Computer
0


సౌదీ అరేబియాలోని జెడ్డా తీరానికి సమీపంలో ఉన్న అండర్‌సీ ఫైబర్-ఆప్టిక్ కేబుళ్లు ఇటీవల తెగిపోవడంతో భారత్, పాకిస్తాన్, యూఏఈ సహా ఆసియాలోని పలు దేశాల్లో ఇంటర్నెట్ సేవలు తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ విఘాతం వాణిజ్య నౌకల రాకపోకల వల్లే జరిగి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నౌకలు సముద్రంలో యాంకర్ వదిలినప్పుడు అవి అడుగున ఉన్న కేబుళ్లను లాగడంతో తెగిపోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ కేబుల్ రక్షణ కమిటీ నివేదిక ప్రకారం.. ప్రతీ ఏటా యాంకర్ల వల్లే ప్రపంచవ్యాప్తంగా 30% కేబుల్ విఘాతాలు ఇలాగే జరుగుతున్నాయి. పైగా తాజాగా తెగిన కేబుల్స్‌ ఎర్ర సముద్రం మరియు ఆఫ్రికా-అరబ్ ద్వీపకల్పం మధ్య 'బాబ్‌ ఎల్‌ మందెబ్‌ స్ట్రెయిట్‌' అనే వ్యూహాత్మక ప్రాంతంలోనే ఉంది. అయినప్పటికీ ఇక్కడ సముద్రపు లోతు తక్కువగా ఉండడం వల్ల యాంకర్లు కేబుళ్లను తాకే అవకాశం ఎక్కువ ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజా ఘటనలో SMW4, IMEWE, FALCON GCX, EIG వంటి కీలక కేబుళ్లు ప్రభావితమయ్యాయి. వీటి ద్వారా ఆసియా, మధ్యప్రాచ్యం, యూరప్ మధ్య డేటా ట్రాఫిక్ జరుగుతుంది. దీంతో సంబంధిత దేశాల్లో స్లో కనెక్టివిటీ, అధిక ల్యాటెన్సీ వంటి సమస్యలు తలెత్తాయి. అయితే మైక్రోసాఫ్ట్‌ అజూర్‌, ఎటిసలాట్‌, డీయూ ట్రాఫిక్‌ను రీరూట్‌ చేసి తమ సేవలను కొనసాగిస్తున్నాయి. ఈ విఘాతం వెనుక ప్రాంతీయ రాజకీయ ఉద్రిక్తతలు కారణమనే అనుమానాలు మొదట వ్యక్తం అయ్యాయి. అయితే, హౌతీలు తమ ప్రమేయాన్ని ఖండించారు. యెమెన్ ప్రభుత్వం మాత్రం ఈ దాడులను డిజిటల్ మౌలిక సదుపాయాలపై ఉద్దేశపూర్వక దాడులుగా అభివర్ణించింది. ''ఇప్పుడు ఎర్ర సముద్రంలో జరుగుతున్నది ప్రపంచ సమాజానికి హెచ్చరికగా ఉండాలి. ఆధునిక ప్రపంచానికి ప్రాణవాయువులాంటి డిజిటల్ మౌలిక సదుపాయాలను రక్షించాల్సిన అవసరం ఉంది'' అని యెమెన్‌ అధికారిక సమాచార శాఖ మంత్రి మొఎమ్మర్ అల్-ఎర్యానీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేబుళ్ల మరమ్మతులకు స్పెషలైజ్డ్ నౌకలు, సాంకేతిక నిపుణులు అవసరం. దీంతో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని వారాలు పట్టే అవకాశం ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)