దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ స్వదేశీ 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తుండడం విశేషం. ఇది క్లౌడ్ ఆధారిత నెట్‌వర్క్ అని, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు 5జీకి సులువుగా అప్‌గ్రేడ్ అవ్వొచ్చని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలను దేశవ్యాప్తంగా సుమారు 98 వేల సైట్లలో అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి వివరించారు. పలు రాష్ట్రాల్లో ఒకేసారి ప్రారంభోత్సవం జరగనుందని చెప్పారు. ప్రధాని మోడీ ఒడిశాలోని జార్సుగుడా నుంచి ఈ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించనున్నారని తెలిపారు. గువాహటిలో జరిగే కార్యక్రమంలో మంత్రి సింధియా పాల్గొననున్నారు. "భారత్ ఇప్పుడు టెలికాం పరికరాల ఉత్పత్తి, తయారీలో అగ్రదేశాల సరసన చేరింది. ఇప్పటివరకు డెన్మార్క్, స్వీడన్, దక్షిణ కొరియా, చైనా మాత్రమే ఈ రంగంలో ఉండగా, భారత్ ఐదో దేశంగా నిలిచింది" అని సింధియా పేర్కొన్నారు. అలాగే, డిజిటల్ భారత్ నిధి కార్యక్రమంలో భాగంగా వంద శాతం 4జీ సాచురేషన్ ప్రాజెక్టును కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కింద 29,000- 30,000 గ్రామాల్లో టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి వెల్లడించారు.
రేపటి నుంచి అందుబాటులోకి రానున్న బీఎస్‌ఎన్‌ఎల్ స్వదేశీ 4జీ సేవలు
September 26, 2025
0
Tags