డబుల్ డెక్కర్ బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు :10 మంది మృతి

Telugu Lo Computer
0


మెక్సికో సిటీకి సుమారు 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటలకోముల్కో వద్ద ఓ రైలు క్రాసింగ్ వద్ద ప్రయాణికులతో నిండిన ఓ డబుల్ డెక్కర్ బస్సును వేగంగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, దాదాపు 60 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఫుటేజీలు ఈ భయంకరమైన ఘటనను కళ్లకు కట్టాయి. మరావటియో-అటలకోముల్కో హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయిన సమయంలో బస్సు రైల్వే ట్రాక్‌కు దగ్గరగా నిలబడి ఉంది. రైలు రాకను గమనించిన బస్సు డ్రైవర్ రైలు వెళ్లేలోగా ట్రాక్‌ను దాటడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు బస్సు మధ్యభాగాన్ని బలంగా ఢీకొట్టింది. రైలు బస్సును చాలా దూరం ఈడ్చుకుంటూ వెళ్లడంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో బస్సు పైభాగం పూర్తిగా విరిగిపోయింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అంబులెన్స్, సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల నుంచి గాయపడిన వారిని, మరణించిన వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మెక్సికో అటార్నీ జనరల్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం, మరణించిన 10 మందిలో ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరికి స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రి నుంచి వెంటనే డిశ్చార్జ్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)