ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిపికేషన్ విడుదల!

Telugu Lo Computer
0


ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నామినేషన్ దాఖలు చేసేందుకు ఆగస్ట్ 21వ తేదీ చివరి తేదీగా ప్రకటించింది. ఇక 22వ తేదీన నామినేషన్ల పరిశీలన, 25వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు విధించినట్లు తెలిపింది. సెప్టెంబర్ 9వ తేదీన పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక చేసే నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీతోపాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ జడ్డాకు అప్పగించినట్లు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రకటించాయి. గురువారం న్యూఢిల్లీలో పార్లమెంట్ చాంబర్‌లోని జేపీ నడ్డా కార్యాలయంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన కీలక నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై వారంతా చర్చించారు. అనంతరం అభ్యర్థి ఎంపిక బాధ్యతను ప్రధాని మోడీతోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఆమోదించాయి. అలాగే భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ ముందు రోజు అంటే.. సెప్టెంబర్ 8వ తేదీన ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సమావేశం కావాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డాతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన కీలక నేతలు జేడీ (యూ) నుంచి లలాన్ సింగ్, శివసేన నుంచి శ్రీకాంత్ షిండే. టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయులు, ఎల్‌జేపీ నుంచి కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)