భారతీయ ప్రయాణికులకు అట్లీస్ సంస్థ బంపర్ ఆఫర్ : రూపాయికే వీసా

Telugu Lo Computer
0


విదేశీ ట్రిప్ ప్లాన్‌ చేసుకునే భారతీయ ప్రయాణికులకు అట్లీస్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారికి రూపాయికే వీసా ఇస్తామని వెల్లడించింది. ఆగస్టు 4-5 తేదీల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫాం అట్లీస్ 2021లో ప్రారంభమైంది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో మోహక్ నహ్తా దీనిని స్థాపించారు. ఈ సంస్థ ఇప్పుడు 'వన్‌ వే అవుట్‌' పేరిట యూఏఈ, యూకే, వియత్నాం, ఇండోనేసియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్‌, హాంకాంగ్‌, జార్జియా, ఒమన్‌, మొరాకో, ఖతర్‌, కెన్యా, తైవాన్‌ వంటి దేశాలకు వెళ్లానుకునేవారికి రూపాయి ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. ''మీరు అట్లీస్‌ ద్వారా వీసా బుక్‌ చేసుకుంటే గ్రీస్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌, ఇటలీ వంటి ఎంపిక చేసిన షెంజెన్‌ దేశాల విషయంలో సేవా రుసుము, అపాయింట్‌మెంట్‌ ఫీజు రెండూ ఉండవు. ఫ్రాన్స్‌కు వెళ్లాలనుకుంటే అపాయింట్‌మెంట్‌ ఫీజు రూ.2,047 ఉండొచ్చు. సర్వీస్‌ ఫీజ్‌ రూ.2,950గా ఉంటుంది. ఈ ఆఫర్ కింద ఆ మొత్తం ఏమీ లేకుండా కేవలం రూపాయి చెల్లిస్తే సరిపోతుంది'' అని మోహక్ మీడియాకు వెల్లడించారు. అమెరికాకు మామూలుగా సర్వీస్‌ ఫీజు రూ.19,940 వరకు ఉంటుందని, ఈ ఆఫర్ అందుబాటులో ఉన్న సమయంలో రూపాయి మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. యూకేకు ఇదే వర్తిస్తుందని చెప్పారు. ఈ వీసా అప్లికేషన్ ప్రాసెస్‌లో మార్పులు ఏమీ ఉండవు. అట్లీస్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయగానే.. ఈ ఆఫర్ దానంతటదే వర్తిస్తుంది. అయితే ప్రాసెసింగ్ కేంద్రం వద్ద మాత్రం కాన్సులేట్, బయోమెట్రిక్ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్యాంపెయిన్‌లో అవి భాగం కావు. ఇక, చెల్లుబాటయ్యే భారత పాస్‌పోర్టు ఉండి.. ఒక వీసా వరకు దీనిని ఉపయోగించుకోవచ్చు. ఆగస్టు 4 ఉదయం ఆరు గంటల నుంచి ఆగస్టు 5 రాత్రి 12 గంటలలోపు ఈ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. కుటుంబసభ్యులు కూడా తోడయితే వారికి సాధారణ ఛార్జీలే ఉంటాయి. మీరు వెళ్తున్న దేశాన్ని బట్టి ఆయా ఎంబసీలు విధించిన నిబంధనలను గమనించుకోవాలి. లేకపోతే వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ''ప్రయాణికులు ఊహించనిరీతిలో తొలిసారి ఈ ధరల్లో వీసాను పొందొచ్చు. అంతర్జాతీయ ప్రయాణాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని నిరూపించేందుకే ఈ ప్రయత్నం'' అని నహ్తా వెల్లడించారు. ఈ అట్లీస్‌ సంస్థ గతంలో కూడా వార్తల్లో నిలిచింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా స్వర్ణం గెలిస్తే వినియోగదారులకు ఉచితంగా వీసా అందిస్తామని ప్రకటించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)