మోస్ట్ వాంటెడ్, కరుడుగట్టిన నేరస్థుడు 'సలీమ్ పిస్టల్' ను ఢిల్లీ పోలీసులు నేపాల్‌లో అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, భారత భద్రతా సంస్థలు, నేపాల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో చిక్కినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్ నుంచి భారత్‌కు అత్యాధునిక ఆయుధాలను అక్రమంగా సరఫరా చేస్తున్న ఇతడి అసలు పేరు షేక్ సలీమ్. నేర కార్యకలాపాలతో 'సలీమ్ పిస్టల్'గాను పేరుగాంచాడు. పాక్ ఐఎస్‌ఐ, దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-కంపెనీతోనూ ఇతడికి సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. లారెన్స్ బిష్ణోయ్, హసీమ్ బాబా వంటి ఎంతో మంది కీలక గ్యాంగ్‌స్టర్లకు ఇతడే ఆయుధాలు సరఫరా చేస్తుంటాడు. సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ ఇతడి పేరు వినిపించింది. ఢిల్లీలోని జఫ్రాబాద్‌కు చెందిన షేక్ సలీమ్ 8వ తరగతి పూర్తిచేశాడు. చదువు మానేసిన తర్వాత కొన్నేళ్ల పాటు డ్రైవర్‌గా పనిచేశాడు. 2000లో దొంగతనాలతో ఇతడి నేర ప్రస్థానం ప్రారంభమైంది. సహచరుడు ముకేశ్ గుప్తా అలియాస్ కాకాతో కలిసి వాహనాలను తస్కరించడం మొదలుపెట్టాడు. 2011లో జఫ్రాబాద్‌లో జరిగిన రూ.20లక్షల దొపీడీ కేసు సహా అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడు పలుసార్లు పోలీసులకు చిక్కి తప్పించుకున్నాడు. అక్రమ, అసాంఘిక కార్యకలాపాలతో 'సలీమ్ పిస్టల్' తన నేర సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకున్నాడు. భారత్‌లోనే కాకుండా పాకిస్థాన్‌తోనూ ఇతడికి సంబంధాలు ఉన్నాయి. బాబా సిద్ధిఖీ హత్య కేసులోనూ ఇతడి పాత్ర ఉన్నట్లు సమాచారం. 2018లో దిల్లీ పోలీసులు అరెస్టు చేయగా కొన్ని రోజులకే విడుదలై విదేశాలకు పారిపోయాడు. నేపాల్‌లో తలదాచుకున్నట్లు నిఘా సంస్థలకు ఇటీవల సమాచారం అందడంతో సంయుక్త ఆపరేషన్ చేపట్టి సలీమ్ పిస్టల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కరుడుగట్టిన నేరస్థుడు సలీమ్ పిస్టల్ అరెస్టు ?
August 09, 2025
0
Tags