ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న ప్రసిద్ధ న్యాయమూర్తి, 'కాట్ ఇన్ ప్రొవిడెన్స్' షో స్టార్ ఫ్రాంక్ కాప్రియో కన్నుమూశారు. 88 ఏళ్ల వయసులో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో పోరాడుతూ ఈరోజు ఉదయం ఆస్పత్రిలో శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సహచరులు తీవ్రంగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రోజున ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరిన కాప్రియో, ఒక్క రోజే గడవకముందే ప్రాణాలు కోల్పోవడం మరింత దిగ్భ్రాంతిని కలిగించింది.ఫ్రాంక్ కాప్రియో పేరు వినగానే మనసులోకి వచ్చే మొదటి విషయం - మానవత్వం. ఆయన ఇచ్చిన తీర్పులు కేవలం చట్టపరమైనవే కాకుండా, కరుణ, దయ, సహనంతో నిండిపోయేవి. అమెరికాలోని రియాలిటీ కోర్ట్ షో 'కాట్ ఇన్ ప్రొవిడెన్స్' ద్వారా ఆయన ప్రపంచానికి సుపరిచితులయ్యారు. ఈ షో 2018 నుంచి 2020 వరకు ప్రసారమై, అనేక ఎమ్మీ అవార్డులకు నామినేట్ అయ్యింది. ఆయన న్యాయస్థానంలో సామాన్య ప్రజల పట్ల చూపిన దయ, సహనం, సానుభూతి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వారికి జరిమానాలు రద్దు చేయడం, వారికి ధైర్యం చెప్పడం వంటి ఆయన వీడియోలకు ఆన్‌లైన్‌లో బిలియన్ల కంటే ఎక్కువగా వ్యూస్ వచ్చాయి.ఫ్రాంక్ కాప్రియో తన మరణానికి ఒక రోజు ముందు ఇన్‌స్టాగ్రామ్ వేదిక గా ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆయన తన ఆరోగ్యం క్షీణించిందని.. క్యాన్సర్ ఎక్కువవడంతో, మళ్లీ ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పారు. ఈ కష్ట సమయంలో తన కోసం దేవుడిని ప్రార్థించమని ఆయన తన అభిమానులు, ఫాలోవర్లను అభ్యర్థించారు. ఈ వీడియో పెట్టి 24 గంటలు కూడా కాకముందే ఆయన ప్రాణాలు కోల్పోయారు.
లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న ప్రసిద్ధ న్యాయమూర్తి ఫ్రాంక్ కాప్రియో కన్నుమూత
August 21, 2025
0
Tags