ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకుంటూ ఇవాళ స్త్రీ శక్తి పథకానికి అంకురార్పణ చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండవల్లిలో సిటీ ఆర్డినరీ బస్సులోకి ఎక్కి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి ప్రయాణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఇవాళ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్త్రీ శక్తి- ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఉండవల్లిలో ప్రారంభించారు. అనంతరం ఉండవల్లి నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్టీసీ బస్సులో విజయవాడకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తలో సీట్లో మహిళలతో కలిసి కూర్చుని ప్రయాణం కూడా చేశారు. మార్గ మధ్యలో మహిళలతో వారు సంభాషించారు. ఉచిత బస్సు పథకం నేపథ్యంలో వారి మనోభావాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఉండవల్లిలో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రారంభమైన చంద్రబాబు, లోకేష్, పవన్ ప్రయాణం ఉండవల్లి సెంటర్ మీదుగా విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వరకూ సాగింది. మార్గమధ్యలో వీరు మహిళల సాధక బాధకాలు తెలుసుకుంటూ, రోడ్డుకు ఇరువైపులా నిలబడిన ప్రజలు, మహిళలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అలాగే ఈ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు ఆర్టీసీ సిబ్బంది ఉండవల్లి నుంచి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వరకూ జీరో ఫేర్ టికెట్ కొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇందులో గ్రామాల్లో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, పట్టణాలు, నగరాల్లో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఈ పథకం అమలు కానుంది. ఈ పథకం అమలయ్యే బస్సుల్ని సులువుగా గుర్తించేందుకు వాటిపై ఉచిత ప్రయాణం స్టిక్కర్లు కూడా అతికించనున్నారు. అలాగే ఈ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు జీరో టికెట్ కొడతారు.
ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ శక్తి పథకానికి అంకురార్పణ : బస్సు మహిళలతో చంద్రబాబు, పవన్ ప్రయాణం
August 15, 2025
0
Tags