కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో నాలుగు దశాబ్దాలుగా అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపేసింది. దీనిపై పాకిస్తాన్ నెదర్లాండ్స్ లోని హేగ్ లో ఉన్న అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన అంతర్జాతీయ న్యాయస్థానం భారత్ ను సింధు జలాల నిలిపివేతపై వెనక్కి తగ్గాలని ఆదేశించింది. అయితే ఈ కోర్టు పరిధిని తాము గుర్తించడం లేదని, సింధు ఒప్పందం అమలు చేయబోమని బారత్ తేల్చిచెప్పింది. అయితే మరోసారి తాజాగా అంతర్జాతీయ కోర్టు సింధు జలాలను పాకిస్తాన్ వాడుకునేందుకు వీలుగా వదలాలని భారత్ ను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ మేరకు గతంలో తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గాలని సూచించినట్లు తెలుస్తోంది. సింధు జలాల నిలిపివేతకు బదులుగా తటస్థ నిపుణుల్ని ఆశ్రయించాలని సూచించింది. అయితే ఈ తీర్పును కూడా భారత్ తోసిపుచ్చింది. అయితే దీనిపై ఆధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరోవైపు సింధు జలాల ఒప్పందంపై శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పాకిస్తాన్ స్వాగతించింది. పశ్చిమ నదులపై తన హక్కులను కాపాడుకునే గణనీయమైన చట్టపరమైన విజయంగా దీనిని అభివర్ణించింది. సింధు జలాల ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా పాకిస్తాన్ ఉపయోగం కోసం ఈ నదుల నిరంతర ప్రవాహాన్ని భారతదేశం కొనసాగించాలని కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కోరింది. కోర్టు అధికార పరిధిని భారతదేశం తిరస్కరించినప్పటికీ, ఒప్పందాన్ని పూర్తిగా పాటించడం, కోర్టు తీర్పును అమలు చేయడం మాత్రం కొనసాగించాలని కోరింది. గతంలో సింధు నది ఉపనదులపై జమ్మూకశ్మీర్ లో ఉన్న కిషన్ గంగ, రాట్లే ప్రాజెక్టుల నిర్మాణంపై ఉన్న వివాదంపై ఉన్న ఉత్తర్వుల్ని అంతర్జాతీయ కోర్టు సవరించింది. అయితే ప్రపంచబ్యాంక్ సమక్షంలో గతంలో జరిగిన ఒప్పందం మేరకు తటస్థ నిపుణుల ఆధ్వర్యంలో ఈ వివాదాల పరిష్కారం జరగాలన్న వాదనను మాత్రం భారత్ తిరస్కరిస్తూనే ఉంది. 2022లోనే భారత్ అభ్యంతరాల్ని బేఖాతరు చేస్తూ ప్రపంచ బ్యాంక్ తటస్థ నిపుణుల కమిటీతో పాటు కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ను నియమించింది. అయితే వీటి నిర్ణయాల్ని కూడా భారత్ పట్టించుకోలేదు.
సింధు జలాలపై అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను తోసిపుచ్చిన భారత్
August 13, 2025
0
Tags