యూట్యూబ్‌లో చూసి ఏటీఎంల చోరీలకు ప్లాన్ చేసి దొరికిపోయిన ముగ్గురు దోస్తులు !

Telugu Lo Computer
0


తెలంగాణాలో ముగ్గురు దోస్తుల మాస్టర్ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఈజీ మనీకి అలవాటు పడి బ్యాంకులు, ఏటీఎంలను లక్ష్యంగా చోరీలు చేశారు. బ్యాంకుల్లో దొంగతనం ఎలా చేయాలో యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నారు. నిందితులు ముగ్గురు కూడా 28 ఏళ్ల లోపు యువకులే.  గుమ్మడిదలలో హెచ్డీఎఫ్సీ ఏటీఎం , వెల్దుర్తిలో సెంట్రల్ బ్యాంక్, మెదక్‌లో ఎస్బీఐ ఏటీఎంలలో చోరీకి యత్నించారు. ఏటీఎం మెషిన్‌లను ఎత్తుకెళ్లేందుకు ఓ ట్రాక్టర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని సార్లు వైన్స్‌లలో మద్యం బాటిళ్లు సైతం చోరీ చేసి అమ్ముకున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితులను మెదక్ జిల్లా మానేపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ (24), లింగం (28), ప్రసాద్ (20)లుగా పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మద్యం బాటిళ్లు, చోరీకి ఉపయోగించే తాడు, సుత్తి, ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు పూర్తి వివరాలు వెల్లడించారు. నిందితులు ముగ్గురూ స్నేహితులేనని ఈజీ మనీ కోసం దొంగతనాలకు అలావాటు పడ్డట్టు చెప్పారు. “యూట్యూబ్‌లో వీడియోలు చూసి బ్యాంకులు, ఏటీఎంలలో దొంగతనాలు చేశారు. పులువురు బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశాం. సీసీటీవీ ఫుటేజీలు, పలు ఆధారాల సాయంతో నిందితులు మానేపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించాం. పోలీసులు ఆ గ్రామానికి వెళ్లగా శివారులో వీళ్లు కనిపించారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నాం.” అని ఎస్పీ వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)