సుంకాలు అమల్లోకి రావడంతో భారీ నష్టాల్లో సూచీలు !

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు అమల్లోకి రావడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.  దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాల కొనసాగుతుండడం వంటి కారణాలు ఆజ్యం పోశాయి. ముఖ్యంగా బ్యాంక్‌ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలను పడేశాయి. దీంతో సెన్సెక్స్‌ దాదాపు 700 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 24,500 స్థాయికి చేరింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర ఆవిరై రూ.445 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 80,754.66 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,786.54) నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 80,013.02 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 705.97 పాయింట్ల నష్టంతో 80,080.57 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 211.15 పాయింట్ల నష్టంతో 24,500.90 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.63గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రధానంగా నష్టాలు చవిచూశాయి. టైటాన్‌, ఎల్‌అండ్‌టీ, మారుతీ సుజుకీ, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా.. యూరప్‌ మార్కెట్లలోనూ అదే ధోరణి కనిపిస్తోంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 67.79 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్సు 3,397 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.


Post a Comment

0Comments

Post a Comment (0)