ఒడిశా లోని బాలేశ్వర్ ఫకీర్ మోహన్ కాలేజీలో లెక్చరర్ వేధింపులు భరించలేక కాలేజీ ప్రాంగణంలో నిప్పంటించుకొన్న యువతి మూడు రోజులు మృత్యువుతో పోరాడి మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ ఇది ఆత్మహత్య కాదు వ్యవస్థీకృత హత్య అని అన్నారు. బాధితురాలిని రక్షించడంలో ఒడిశాలోని భాజపా ప్రభుత్వం విఫలమైందంటూ రాహుల్ మంగళవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. 'ఒడిశాలో న్యాయం కోసం బాధిత విద్యార్థిని ధైర్యంగా, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తన గొంతుక వినిపించింది. అందుకు ఆమెకు న్యాయం చేయడానికి బదులు బెదిరించి, హింసించారు. పదేపదే అవమానించారు. ఎప్పటిలాగే భాజపా వ్యవస్థ నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. ఒక అమాయకురాలైన విద్యార్థిని తనకు తాను నిప్పంటించుకునేలా చేసింది. ఇది ఆత్మహత్య కాదు, వ్యవస్థీకృత హత్య. మోడీజీ ఒడిశా లేదా మణిపుర్‌లో అయినా దేశంలో కుమార్తెలు కాలిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు ఇంకా మౌనంగానే ఉంటారా?. దేశానికి మీ మౌనం అవసరం లేదు. వీటన్నింటికీ సమాధానాలు కావాలి. భారతదేశ మహిళలకు భద్రత, న్యాయం కావాలి' అని రాహుల్ రాసుకొచ్చారు. ఒడిశా లోని బాలేశ్వర్ ఫకీర్ మోహన్ కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ రెండో సంవత్సరం చదువుతున్న బాధిత విద్యార్థిని విభాగాధిపతి సమీర్‌సాహు కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు. తన మాట వినకుంటే భవిష్యత్తు నాశనం చేస్తానని బెదిరించసాగాడు. ఇవి భరించలేని ఆ విద్యార్థిని జూన్ 30న కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా.. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ ఎలాంటి పురోగతి కన్పించలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాధిత విద్యార్థిని కాలేజీ క్యాంపస్‌లోనే నిరసన చేపట్టింది. ఈక్రమంలోనే జూన్ 12న ఒక్కసారిగా ప్రిన్సిపల్ కార్యాలయానికి పరుగెత్తిన ఆమె.. అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. తోటి విద్యార్థులు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా సోమవారం అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయింది.
ఆమెది ఆత్మహత్య కాదు, వ్యవస్థీకృత హత్య : రాహుల్ గాంధీ
July 15, 2025
0
Tags