ఆపరేషన్ సిందూర్‌పై రాజసభ్యలోనూ వాడీవేడీ చర్చ జరిగింది. ఈ క్రమంలో రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై సభాపక్ష నేత జేపీ నడ్డా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర వాగ్వాదానికి కారణమైంది. దీంతో అధికార, విపక్ష సభ్యుల చప్పుళ్లతో సభ కొద్దిసేపు దద్దరిల్లింది. చివరకు తన వ్యాఖ్యలను నడ్డా వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పడంతో సభ సద్దుమణిగింది. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దాదాపు గంటపాటు ప్రసంగించారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ పైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఖర్గే ప్రసంగం ముగిసిన వెంటనే స్పందించిన నడ్డా కాంగ్రెస్ అధ్యక్షుడు 'మానసిక సమతుల్యత' కోల్పోతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో నడ్డా చర్యలను తీవ్రంగా తప్పుపట్టిన విపక్షాలు క్షమాపణ చెప్పాలంటూ బల్లలు చరుస్తూ ఆందోళన చేపట్టాయి. అనంతరం ఖర్గే కూడా మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వంలో తాను గౌరవించే మంత్రుల్లో నడ్డా కూడా ఒకరని, అయినప్పటికీ తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. వెంటనే కేంద్ర మంత్రి నడ్డా స్పందిస్తూ.. ఇప్పటికే తన మాటలు వెనక్కి తీసుకున్నానని, క్షమాపణ కూడా చెప్పానని అన్నారు. ''నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న నాయకుడు. అందుకు భాజపానే కాదు దేశం మొత్తం గర్విస్తోంది'' అని కేంద్ర మంత్రి నడ్డా పేర్కొన్నారు. ఖర్గే మాత్రం ఆయన స్థాయిని పట్టించుకోకుండా అభ్యంతరకరంగా మాట్లాడారని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడికి సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ తన పరిధిని దాటి ప్రధానిపై వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అవి ఆయన స్థాయికి తగినట్లు లేవని, వాటిని రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని జేపీ నడ్డా పేర్కొన్నారు.
మల్లికార్జున ఖర్గేకు జేపీ నడ్డా క్షమాపణలు
July 29, 2025
0
Tags